టీడీపీ నాయకుడి హల్‌చల్
● బిహార్ కూలీలపై దౌర్జన్యం ● అనుచరులతో కలిసి ట్రాక్టర్లు, బైక్, డీజల్ డ్రమ్ములు ధ్వంసం
సంజామల: పార్టీ అధికారంలో ఉందని టీడీపీ నాయకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. అమాయకులపై దాడులు, దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు.తాజాగా బతుకుదేరువు కోసం వచ్చిన బిహార్ కూలీలపట్ల సంజామల మండలం పేరుసోముల గ్రామ టీడీపీ నాయకుడు సురేష్‌రెడ్డి దురుసుగా ప్రవర్తించాడు. అనుచరులతో కలిసివారి ట్రాక్టర్స్, బైక్,డీజల్ డ్రమ్ములను ధ్వంసం చేశాడు. స్థానికుల సమాచారం మేరకు.. పేరుసోముల గ్రామ శివారు పెద్దమ్మ గుడి వద్ద టర్నింగ్‌లో టవర్ వర్క్ పనుల నిమిత్త వచ్చిన బిహార్ కూలీలు నివాసం ఉంటున్నారు. మంగళవారం రాత్రి పది గంటల సమయంలో టీడీపీ నాయకుడు సురేష్‌రెడ్డి కోవెలకుంట్ల నుంచి వస్తున్నాడు. పేరుసోముల పెద్దమ్మ గుడి వద్ద రోడ్డుపై ట్రాక్టర్ అడ్డుగా ఉందని బిహార్ కూలీలతో దురుసుగా వ్యవహరిస్తూ వాగ్వాదం దిగాడు. వారు ప్రతిఘటించడంతో గ్రామానికి వెళ్లి అనుచరులను వెంటేసుకుని కూలీల నివాసం దగ్గరికి వచ్చాడు. టీడీపీ కార్యకర్తలు కొట్టాడానికి వస్తున్నారన్న సమాచారం తెలుసుకున్న బిహార్ కూలీలు భయంతో అక్కడి నుంచి పారిపోయారు. ఇళ్ల వద్ద ట్రాక్టర్స్, బైక్, డీజల్ డ్రమ్ములు ఉండటంతో వాటిని ధ్వంసం చేసి హల్‌చల్ చేశారు. కూలీలపై దాడి విద్యుత్ టవర్ కాంట్రాక్టర్ ను బయపెట్టడానికా? లేక మరేదైనా కారణం ఉందా అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు.


