హోం వర్క్ చేయలేదని విద్యార్థిపై టీచర్ దాడి
బేతంచెర్ల: హోంవర్క్ చేయలేదని విద్యార్థిపై ఉపాధ్యాయుడు దాడి చేశాడు. గోరుమానుకొండ ఏపీ రెసిడెన్సియల్ గురుకుల పాఠశాలలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే.. డోన్ మండల ఉడుములపాడు గ్రామానికి చెందిన కుల్లాయి కొడుకు హర్షవర్ధన్ గురుకుల పాఠశాలలో 7వ తరగతి చదువుతున్నాడు. ఈ నెల 3వ తేదీన విద్యార్థి హోం వర్క్ చేయలేదని ఉపాధ్యాయుడు బెత్తంతో తలపై కొట్టడంతో రక్త గాయమైంది. మనస్థాపానికి గురైన ఆ విద్యార్థి 4వ తేదీన ఉదయం ఎవరికీ చెప్పకుండా పాఠశాల నుంచి వెళ్లిపోయాడు. ఈ విషయాన్ని ఉపాధ్యాయులు తల్లిదండ్రులకు తెలియజేశారు. ఆందోళనకు గురైన వారు ఆచూకీ కోసం పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే, అదే రోజు రాత్రి కుమారుడు ఇంటికి రావడంతో టీచర్ తలపై కొట్టిన విషయం తెలిసింది. సదరు ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకోవాలని బుధవారం డోన్ ఆర్డీఓ నరసింహులును కలిసి ఫిర్యాదు చేశారు. విచారించి చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చినట్లు విద్యార్థి తల్లిదండ్రులు తెలిపారు.
హోం వర్క్ చేయలేదని విద్యార్థిపై టీచర్ దాడి


