హత్యకోణంలో విచారణ
గడివేముల: మండల కేంద్రమైన గడివేముల గ్రామానికి చెందిన ఓ యువకుడి అదృశ్యం కేసులో పోలీసుల విచారణ ముమ్మరం చేశారు. వినోద్ (21) గత ఏడాది ఆగస్టు 31 వ తేదీన నంద్యాలలో స్నేహితుల వద్దకు వెళ్తున్నట్లు ఇంట్లో చెప్పి వెళ్లాడు. రెండు రోజులైనా తిరిగి రాకపోవడంతో స్థానిక పోలీస్ స్టేషన్‌లో తండ్రి రాజు ఫిర్యాదు చేయడంతో అప్పట్లో అదృశ్యం కేసు నమోదైంది. రెండు రోజుల క్రితం పోలీసులు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టగా పలు విషయాలు వెలుగుచూశాయి. వినోద్ బైక్‌ను బొల్లవరం రస్తాలోని ఎస్సార్‌బీసీ బ్రిడ్జి నుంచి కిందకు పడేసినట్లు అనుమానితులు చెప్పడంతో బుధవారం అక్కడికి వెళ్లి పరిశీలించగా బైకు కనిపించింది. దీంతో ఈ కేసును పోలీసులు హత్యకోణంలో విచారిస్తున్నారు.


