
డీఎస్సీలో అంతా హైడ్రామా!
● 90 రోజుల సమయం లేకుండానే
పరీక్షల నిర్వహణ
● తుది కీలోనూ అనేక తప్పులు
● ఒక్కో పోస్టుకు ఒక అభ్యర్థి
ఎంపిక అని మెలిక
● ఇప్పటి వరకు రాని ఉద్యోగాలకు
ఎంపికై న వారి వివరాలు
● సర్టిఫికెట్ల వెరిఫికేషన్ వాయిదా
కర్నూలు సిటీ: ఉమ్మడి రాష్ట్రంలో ఎన్నో డీఎస్సీల నోటిఫికేషన్ల ద్వారా ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేశారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం మోగా పేరుతో డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చినప్పటి నుంచి హైడ్రామా నడిచింది. డీఎస్సీ పరీక్షలు నెల రోజుల పాటు నిర్వహించిన తరువాత నార్మలైజేషన్ చేయడంతో చాలా తప్పులు జరిగాయనే ఆరోపణలు వచ్చాయి. అయితే ఆ తప్పులు సరిదిద్దేందుకు సమయం పడుతుండడంతోనే తుది సెలక్షన్ జాబితాల విడుదలలో జాప్యం జరగుతోందని విద్యాశాఖ వర్గాలు చెబుతున్నాయి. ఆదివారం అర్ధరాత్రి వరకు ఉపాధ్యాయ ఉద్యోగాలకు ఎంపికై న వారి వివరాలు ఇవ్వలేదు. ఎంపికై న వారికి లెటర్లు కూడా పంపించలేదు. ఉపాధ్యాయ ఉద్యోగాలకు ఎంపిౖకైన వారికి సోమవా రం సర్టిఫికెట్లు పరిశీలన చేస్తామని తొలుత చెప్పి తరువాత వాయిదా వేశారు. అంతా హైడ్రామా నడుస్తుడటంతో డీఎస్సీలో మంచి మార్కులు, ర్యాంకులు తెచ్చుకున్న వారు ఆందోళన చెందుతున్నారు.
ఇవీ అనుమానాలు...
గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం డీఎస్సీ నోటిఫికేషన్ ఇస్తే ఆనాడు టీడీపీ పెద్దలు ఒక మాట అన్నారు. డీఎస్సీ ప్రిపరేషన్‌కు కనీసం 90 రోజులు ఉండాలని చెప్పారు. అధికారంలోకి వచ్చాక డీఎస్సీ ప్రిపరేషన్‌కు 90 రోజుల సమయం లేకుండానే నోటిఫికేషన్ ఇచ్చారు. గతంలో ఎన్నడూ లేని విధంగా నెల రోజుల పాటు ఆన్‌లైన్ విధానంలో పరీక్షలు నిర్వహించారు.
● పరీక్షలు ముగిసిన తరువాత విడుదల చేసిన కీ పై అనేక ఫిర్యాదులు వచ్చాయి. అభ్యంతరాలను తీసుకొని తుది కీ ఇచ్చారు. ఇందులోనూ అనేక తప్పులు ఉన్నాయని అభ్యర్థుల నుంచి ఆందోళనలు వచ్చాయి. దీంతో అభ్యంతరాలను స్వీకరించారు కానీ పరిష్కరించారో లేదో అర్థం కానీ పరిస్థితులు ఉన్నాయి.
● పాఠశాల విద్య శాఖ కమిషనర్ విజయరామరాజు గతంలో ఎప్పుడూ లేని విధంగా డీఎస్సీ పరీక్షలు రాసిన వారందరి మార్కులను, ర్యాంకులను ఇవ్వకుండానే ఒక్కో పోస్టుకు ఒక అభ్యర్థిని ఎంపిక చేసి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయాలని హడావుడిగా సిబ్బందికి శిక్షణ ఇచ్చారు. దీనిపై అభ్యర్థులు కోర్టును ఆశ్రయించారు. జడ్జి ఆదేశాల మేరకు మెరిట్ లిస్టులు జారీ చేశారు.
● ఉద్యోగాలకు ఎంపికై న వారిని ఖరారు చేసి జాబితాలు ఇవ్వడంతో అదిగో...ఇదిగో అంటూ రెండు రోజులు విద్యాశాఖ ఉన్నతాధికారులు ప్రకటనలు జారీ చేస్తున్నారు. ఇంత వరకు ఎలాంటి జాబితాలు ఇవ్వక పోవడంతో అభ్యర్థులు మరింత ఆందోళన చెందతున్నారు.
స్పష్టత కరువు
ఉమ్మడి కర్నూలు జిల్లాలో 2,645 పోస్టుల భర్తీకి డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చారు. దీంతో తెలంగాణలోని కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్, హైదరాబాద్, మేడ్చల్, ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, మాన్యం, పార్వతీపురం, విజయనగరం, నెల్లూరు, గుంటూరు జిల్లాలకు చెందిన వారు నాన్‌లోకల్‌లో దరఖాస్తు చేశారు. వారు అత్యధిక మార్కులు సాధించారు. ఉమ్మడి జిల్లా నుంచి ఎంత మంది దరఖాస్తు చేశారు? ఏఏ క్యాటగిరీకి ఎన్ని దరఖాస్తులు వచ్చాయో కూడా ఇంత వరకు విద్యాశాఖ దగ్గర వివరాలు లేవు. ఇదేంటని అడిగిన వారికి రాష్ట్ర స్థాయి నుంచి ఆదేశం వచ్చిందని చెబుతున్నారు. ఇప్పటి వరకు వివరాలను ప్రకటించకపోవడంతో అనేక అనుమానాలు కలుగుతున్నాయి. బీసీ–డీ, బీసీ–ఈ క్యాటగిరీలకు, అన్ని క్యాటగిరీ పోస్టులకు దరఖాస్తు చేసిన అభ్యర్థులకు, చేసిన దరఖాస్తులకు, పరీక్షల తరువాత ప్రకటించిన మెరిట్ జాబితాల్లోని సంఖ్యకు తేడాలు ఉన్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. దీనిపై జిల్లా విద్యాశాఖ అధికారులు డీఎస్సీ కన్వీనర్ దృష్టికి తీసుకపోగా..అలాంటిదేమి లేదని, పబ్లిసిటీ కోసమే అని సమాధానం ఇచ్చినట్లు తెలుస్తోంది.