
భయపడొద్దు.. అండగా ఉంటాం
● వైఎస్సార్‌సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్‌రెడ్డి
ఓర్వకల్లు: టీడీపీ వర్గీయులు అకారణంగా దాడులకు పాల్పడుతున్నారని, ఎవరూ భయపడొద్దని, తాము అండగా ఉంటామని వైఎస్సార్‌సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్‌రెడ్డి ధైర్యం చెప్పా రు. ఓర్వకల్లు మండలంలోని హుసేనాపురం గ్రామంలో ఆదివారం రాత్రి 10.30 గంటల సమయంలో వైఎస్సార్‌సీపీ కార్యకర్త పాల మధుమోహన్‌రెడ్డి ఇంటిపై టీడీపీ వర్గీయులు ముకుమ్మడిగా రాళ్లతో దాడి చేశారు. ఇల్లు పాక్షికంగా దెబ్బతినింది. విషయం తెలిసి బాధి తుని ఇంటికి సోమవారం కాటసాని వెళ్లారు. దాడి జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. మధుమోహన్‌రెడ్డి కుటుంబ సభ్యులను ధైర్యం చెప్పారు. అనంతరం కాటసాని విలేకరులతో మాట్లాడుతూ.. టీడీపీ వర్గీ యులు అకారణంగా దాడులకు బరితెగించడం సమంజసం కాదన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పోలీసులు తమ హోదా, బాధ్యతలను విస్మరించారని ఆరోపించారు. చట్టాలను టీడీపీ నాయకులకు చుట్టాలుగా మారుస్తున్నారని విమర్శించారు. అధికారం ఎవ్వరికీ శాశ్వతం కాదని, పోలీసుల బలాన్ని అడ్డు పెట్టుకొని దుశ్చర్యలకు పాల్పడుతుంటే సహించేది లేదన్నారు. హుసేనాపురం ఘటనలో ఎస్‌ఐ సునీల్ కుమార్ తమ పోలీసు సిబ్బందితో వెంటనే స్పందించడంపై హర్షం వ్యక్తం చేశారు. కాటసాని వెంట మాజీ మార్కెట్ యార్డు చైర్మన్ ప్రభాకర్‌రెడ్డి, ఎంపీపీ తిప్పన్న, జెడ్పీటీసీ సభ్యులు రంగనాథ్‌గౌడు, సింగిల్ విండో మాజీ చైర్మన్ నాగతిరుపాలు, పార్టీ నాయకులు మధుమోహన్‌రెడ్డి, గోపా వెంకటరమణారెడ్డి, గోపా రామ్మోహన్‌రెడ్డి, రామేశ్వరరెడ్డి, గుండాల చెన్నారెడ్డి ఉన్నారు.