
గోశాలలో పశుగ్రాసం దగ్ధం
● రూ.5 లక్షల నష్టం
మంత్రాలయం రూరల్: శ్రీమఠం గోశాలలో జరిగిన ప్రమాదంలో పశుగ్రాసం దగ్ధమైంది. గోశాలలో పశుగ్రాసం ఉంచిన గౌడౌన్‌లో సోమవారం ఉదయం విద్యుత్ షార్ట్‌సర్క్యూట్‌తో మంటలు ఏర్పడి వరిగడ్డికి వ్యాపించాయి. మంటలను గమనించిన మఠం సిబ్బంది గోవులను బయటకు వదిలేశారు. అనంతరం ఎమ్మిగనూరు ఫైర్ స్టేషన్‌కు సమాచారం ఇవ్వడంతో ఫైర్ సిబ్బంది వచ్చి మంటలను అదుపు చేశారు. మంటలకు గౌడౌన్‌లో ఉన్న పశుగ్రాసం మొత్తం పూర్తిగా దగ్ధమైంది. దాదాపు రూ.5 లక్షల మేర నష్టం వాటిల్లినట్లు అగ్నిమాపక సిబ్బంది అంచనా వేశారు.
మైనారిటీ హాస్టల్‌లో ప్రవేశం పొందండి
కర్నూలు(అర్బన్): కళాశాల విద్యను అభ్యసిస్తున్న మైనారిటీ విద్యార్థులు నగరంలోని వెంకటా చలపతి నగర్‌లో ఉన్న ప్రభుత్వ పోస్టు మెట్రిక్ మైనారిటీ బాలుర వసతి గృహంలో ప్రవేశం పొందాలని జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారిణి సయ్యద్ సబీహా పర్వీన్ కోరారు. 2025–26 విద్యా సంవత్సరానికి సంబంధించి 25 సీట్లు ఖాళీగా ఉన్నాయని సోమవారం ఆమె ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలోని దూర ప్రాంతాల నుంచి కర్నూలుకు వచ్చి కళాశాల విద్యను అభ్యసిస్తున్న పేద మైనారిటీ వర్గాలకు చెందిన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
బావిలో పడి భక్తుడి మృతి
కౌతాళం: ఈరన్నస్వామి దర్శనానికి వచ్చిన తెలంగాణ భక్తుడు మృతి చెందాడు. మహబూబ్‌నగర్ జిల్లా హన్వాడా మండలం హనుమాపురానికి చెందిన పెద్దింటి అనిల్‌కుమార్ (50) శ్రావణమాసం సోమవారం సందర్భంగా ఉరుకుంద ఈరన్న స్వామి దర్శనానికి కుటుంబంతో వచ్చాడు. ఉరుకుందకు మజరా గ్రామం అయిన తిమ్మాపురం గ్రామం వద్ద బావిలో అనిల్ స్నానానికి వెళ్లి కాలుజారి పడ్డాడు. ఈత రాకపోవడంతో మునిగిపోతుండటంతో గ్రామస్తులు వెంటనే బయటకు తీయగా అప్పటికే మృతిచెందాడు. కుటుంబ సభ్యులు రోదిస్తున్న తీరు అందరిని కంటతడి పెట్టించింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

గోశాలలో పశుగ్రాసం దగ్ధం