
శ్రీశైలంలో పూర్తిస్థాయి విద్యుదుత్పాదన
శ్రీశైలం ప్రాజెక్ట్: శ్రీశైలం జలాశయ నీటిమట్టం రోజురోజుకు తగ్గుతోంది. ఎగువ ప్రాజెక్ట్‌ల నుంచి వస్తున్న వరద ప్రవాహం కన్నా దిగువకు అధిక మొత్తంలో నీటిని విడుదల చేస్తుండడంతో నీటిమట్టం క్రమంగా పడిపోతుంది. గురువారం నుంచి శుక్రవారం వరకు శ్రీశైలానికి ఎగువ జూరాల, సుంకేసుల ప్రాజెక్ట్‌ల నుంచి 71,021 క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరింది. జలాశయం నుంచి దిగువ ప్రాజెక్ట్‌లకు 1,06,692 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. విద్యుత్ ఉత్పాదన అనంతరం నాగార్జునసాగర్‌కు 65,474 క్యూసెక్కులు, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ ద్వారా 35వేల క్యూసెక్కులు, హంద్రీనీవా సుజలస్రవంతికి 2,818 క్యూసెక్కులు, కల్వకుర్తి ఎత్తిపోతలకు 2,400 క్యూసెక్కుల నీటిని వదిలారు. శ్రీశైలం డ్యాం పరిసర ప్రాంతాలలో 51.80 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. కుడిగట్టు కేంద్రంలో 15.117 మిలియన్ యూనిట్లు, ఎడమగట్టు కేంద్రంలో 15.308 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేశారు. శుక్రవారం సాయంత్రం సమయానికి జలాశయంలో 182.2185 టిఎంసీల నీరు నిల్వ ఉండగా.. డ్యాం నీటిమట్టం 878.90 అడుగులకు చేరుకుంది.
ఉరుకుంద ఈఓ
విజయరాజుపై బదిలీ వేటు
● నూతన ఈఓగా కె.వాణి
మంత్రాలయం: ఉరుకుంద ఈరన్న క్షేత్రం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మేడిపల్లి విజయరాజుపై బదిలీ వేటుపడింది. గుంతకల్లులోని కసాపురం నెట్టికంటి ఆంజనేయస్వామి ఆలయ ఈఓగా ఆయనను బదిలీ చేశారు. అక్కడ ఈఓగా పని చేస్తున్న కె.వాణి ఉరుకుంద ఈరన్న ఆలయ ఈఓగా నియమితులయ్యారు. విజయరాజు గత ఏడాది సెప్టెంబర్ 24న ఇక్కడ ఈవోగా బాధ్యతలు స్వీకరించారు. ఇటీవల ఆలయ ఉప ప్రధాన అర్చకుడు పూజన్న ఆత్మహత్య చేసుకోవడం తెలిసిందే. తన సూసైడ్ నోట్‌లో ప్రధాన అర్చకుడు, వేదపండిట్ మాటలు విని ఈఓ తనతో పాటు ఇతర అర్చకుల పట్ల చులకన భావంతో వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో ఈఓ బదిలీ కావడం చర్చనీయాంశంగా మారింది. ఇదిలాఉంటే కాంట్రాక్టర్ల అక్రమార్జనకు అడ్డుపడుతున్నాడనే కారణంతో రాజకీయ నాయకుల ప్రమేయంతో ఆయనపై బదిలీ వేటు వేసినట్లుగా చర్చ జరుగుతోంది. గతంలో ఈఓగా పని చేసిన హెచ్.జి.వెంకటేష్ కూడా అర్చకుల తట్టను తీయించి ఆలయ ఆదాయాన్ని పెంచడానికి శాఖాపరమైన నిర్ణయం తీసుకోవడం ఆయన బదిలీకి కారణమైంది. అప్పట్లో ఆయ నను కూడా ఉత్సవాల వేళనే బదిలీ చేయడం గమనార్హం. తాజాగా విజయరాజు కూడా అదే తరహాలోనే బదిలీ అయినట్లు సమాచారం.
డ్రోన్ ఆధారిత
ఆరోగ్య పర్యవేక్షణ
కర్నూలు(సెంట్రల్): డ్రోన్ ఆధారిత ఆరోగ్య పర్యవేక్షణ వ్యవస్థ రూపకల్పనకు కర్నూలు ట్రిబుల్ ఐటీడీఎం విద్యాసంస్థ ఆధ్వర్యంలో చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్ పి.రంజిత్‌బాషా తెలిపారు. కలెక్టరేట్‌లోని తన క్యాంపు కార్యాలయంలో ట్రిబుల్ ఐటీడీఎం ఆధ్వ ర్యంలో రూపొందుతున్న డ్రోన్ ఆధారిత ఆరోగ్య పర్యవేక్షణ వ్యవస్థకు సంబంధించిన ప్రదర్శనను శుక్రవారం జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అత్యవసర పరిస్థితుల్లో రోగుల ఆరోగ్య పరిస్థితిని తెలుసుకొని తక్షణమే వైద్య సదుపాయాలు అందించేందుకు ఈ వ్యవస్థ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ఈ వ్యవస్థ వైద్యులు, ఆసుపత్రుల మధ్య రియల్ టైం కమ్యూనికేషన్ నెట్‌వర్కు ఏర్పరుస్తుందన్నారు. ఈ వ్యవస్థను త్వరలోనే ప్రజలకు అందుబాటులోకి తెస్తామన్నారు. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇంజినీరింగ్ విభాగం ప్రొఫెసర్ కె.కృష్ణానాయక్, విభాగం ప్రొఫెసర్ డాక్టర్ రవికుమార్, విద్యార్థులు పాల్గొన్నారు.