12 మండలాల్లో అకాల వర్షాలు | - | Sakshi
Sakshi News home page

12 మండలాల్లో అకాల వర్షాలు

May 14 2025 2:04 AM | Updated on May 14 2025 2:04 AM

12 మండలాల్లో  అకాల వర్షాలు

12 మండలాల్లో అకాల వర్షాలు

కర్నూలు(అగ్రికల్చర్‌): జిల్లాలోని వివిధ మండలాల్లో సోమవారం సాయంత్రం నుంచి మంగళవారం ఉదయం వరకు 12 మండలాల్లో వర్షాలు కురిశాయి. నందవరంలో భారీ వర్షం కురిసింది. రికార్డు స్థాయిలో 69.8 మి.మీ వర్షపాతం నమోదైంది. కర్నూలు రూరల్‌లో 32.2, కర్నూలు అర్బన్‌లో 25.4, కల్లూరులో 23.2, మద్దికెరలో 7.6, ఓర్వకల్‌లో 6.8 మి.మీ ప్రకారం వర్షాలు కురిశాయి. జిల్లా మొత్తంగా సగటున 7.2 మి.మీ వర్షపాతం నమోదైంది. ఈ నెల 14 నుంచి 17వ తేదీ వరకు కర్నూలు, నంద్యాల జిల్లాల్లో ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. కర్నూలు జిల్లాలో ఈ నెల 14న 3 మి.మీ, 15న 7.4, 16న 9, 17న 8.3 మిమీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నట్లు అధికారులు ప్రకటించారు. నంద్యాల జిల్లాలో 14న 2.1, 15న 9.8, 16న 12.1, 17న 10.1 మిమీ వర్షపాతం నమోదు అయ్యే అవకాశం ఉన్నట్లుగా అధికారులు తెలిపారు. ఉరుములు, మెరుపులతో పిడుగులు పడే ప్రమాదం కూడా ఉన్నట్లు పేర్కొన్నారు.

వాము వ్యాపారులు సిండికేట్‌

తగ్గిన ధరలతో నష్టపోతున్న రైతులు

కర్నూలు(అగ్రికల్చర్‌): కర్నూలు వ్యవసాయ మార్కెట్‌ యార్డులో వాము వ్యాపారులు సిండికేట్‌గా మారి రైతులను నష్టాలకు గురి చేస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మార్కెట్‌కు మంగళవారం 88 మంది రైతులు 280 క్వింటాళ్ల వాము తెచ్చారు. కనిష్ట ధర రూ.611, గరిష్ట ధర రూ.24,306 లభించింది. సగటు ధర కేవలం రూ.10,288 మాత్రమే నమోదైంది. వ్యాపారులు ఒకటి, రెండు లాట్లకు మాత్రమే ఎక్కువ ధర వేసి మిగిలిన లాట్లకు తక్కువ ధరలు కోట్‌ చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. వ్యాపారులు సిండికేట్‌ కావడం వల్లే సగటు ధర రూ.10 వేలు మాత్రమే నమోదైందని రైతులు వాపోతున్నారు. కాగా వాము వ్యాపారులు టెండర్‌ హాల్‌లో యథేచ్ఛగా తిరుగుతూ ధరలను తారుమారు చేస్తున్నట్లు తెలుస్తోంది. టెండర్‌ హాల్‌లో కంప్యూటర్‌ ఆపరేటర్లను లోబరుచుకొని తమకు అనుకూలంగా ధరలు మారుస్తున్నారనే చర్చ జరుగుతోంది.

హ్యాండ్‌లూమ్‌ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలు

నంద్యాల(న్యూటౌన్‌): వెంకటగిరిలోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హ్యాండ్‌లూమ్‌ టెక్నాలజీ నందు డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు హ్యాండ్‌లూమ్‌ టెక్నాలజీ ఓఎస్‌డీ గిరిధర్‌రావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. మూడేళ్ల డిప్లోమా కోర్సులకు హ్యాండ్‌లూమ్‌ టెక్నాలజీ 53 సీట్లు, తమిళనాడులో 12 సీట్లు, కర్ణాటకలోని గడగ్‌ నందు నాలుగు సీట్లు అందుబాటులో ఉన్నాయని వెల్లడించారు. అర్హులైన వారు www.iihtvgr.com వెబ్‌సైట్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మరింత సమాచారం కోసం సెల్‌ నంబర్‌ 93999 36872ను సంప్రదించవచ్చన్నారు. దరఖాస్తు చేసుకునేందుకు జూన్‌ 1వ తేదీ వరకు గడువు ఉందని వెల్లడించారు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement