స్వయంశక్తితో రాణించాలి
జ్యోతి ప్రజ్వలన చేస్తున్న
కలెక్టర్, ఎంపీ తదితరులు
నంద్యాల: మహిళలు స్వయం శక్తితో ఎదిగి సాధికారత దిశగా అడుగులు వేయాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి అన్నారు. శనివారం నంద్యాల పట్టణంలోని ఎల్‌కేఆర్ ఫంక్షన్ హాల్‌లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎంపీ బైరెడ్డి శబరి, కలెక్టర్ రాజకుమారి, జాయింట్ కలెక్టర్ సి.విష్ణు చరణ్, యూనియన్ బ్యాంక్ రీజనల్ మేనేజర్ నరసింహారావు తదితరులు హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పురుషులతో సమానంగా మహిళలకు సమాన హక్కులు, వేతనాలు, ఓటు తదితర అంశాలపై ప్రపంచ పోరాటాల నేపథ్యంలోనే భాగంగా ప్రతి సంవత్సరం మార్చి 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నామన్నారు. ప్రతి ఇంటి నుండి ఒక పారిశ్రామిక వేత్త వచ్చి దేశ, రాష్ట్ర భవిష్యత్తుకు పునాదులు వేయాలన్నారు. ఎంపీ బైరెడ్డి శబరి మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మహిళలకు అత్యున్నత స్థానం కల్పించి వారికి చేయూతనిచ్చేందుకు అనేక కార్యక్రమాలను చేపట్టడం జరిగిందన్నారు. అంతకు ముందు ఆవరణలో ఏర్పాటు చేసిన ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులు, మహిళా సంఘాల చేతివృత్తుల వస్తువుల ప్రదర్శనశాలలను కలెక్టర్ ఎంపీ పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. మహిళలు, విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక, సంప్రదాయ నృత్యాలు ప్రేక్షకులను అలరించాయి.
జిల్లా కలెక్టర్ రాజకుమారి


