వినతులను స్వీకరిస్తున్న కలెక్టర్ మనజీర్ జిలానీ
నంద్యాల: స్పందన కార్యక్రమంలో ప్రజల నుంచి వచ్చిన వినతుల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా కలెక్టర్ మనజీర్ జిలానీ శామూన్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లోని వైఎస్సార్ సెంటినరీ హాల్‌లో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో కలెక్టర్‌తో పాటు, జాయింట్ కలెక్టర్ నిశాంతి, డీఆర్‌ఓ పుల్లయ్య, ఉన్నతాధికారులు జిల్లా నలుమూలల నుంచి వచ్చిన అర్జీదారుల నుంచి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఏఏ సచివాలయాల నుంచి అధికంగా అర్జీలు వస్తున్నాయో గుర్తించి తహసీల్దార్లు స్వయంగా వెళ్లి విచారణ చేసి వచ్చే స్పందన కార్యక్రమంలో నివేదిక ఇవ్వాలని తహసీల్దార్లకు సూచించారు. ఓటరు జాబితా ఆధార్ అనుసంధానానికి సంబంధించి ఇంకా జిల్లా వ్యాప్తంగా 2,51,245 మంది ఓటరు ఫాం–6బీ పెండింగ్‌లో ఉందని, బీఎల్‌ఓల వారీగా రోజువారి లక్ష్యాలు కేటాయించి ఈనెల 30 తేదీలోగా పూర్తి చేయాలన్నారు. నాడు–నేడు కింద పనులు చేపట్టిన పాఠశాలలను తనిఖీ చేయాలన్నారు. పాఠశాలల్లో తాగునీరు, టాయిలెట్, రన్నింగ్ వాటర్, మెనూ అమలు తదితర అంశాలను పరిశీలించి వచ్చే నెల 6వ తేదీలోగా నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. మున్సిపల్ పట్టణాల్లో ఆర్‌డీఓలు, మున్సిపల్ కమిషనర్లు తనిఖీలు చేయాలన్నారు. ఈనెల 29న కర్నూలు జిల్లా పరిషత్ సమావేశంలో తాగునీరు, భూగర్భ జలాలు, హౌసింగ్, పశుసంవర్ధకం తదితర అజెండా అంశాలపై సమావేశం ఉంటుందని, ఈ మేరకు అధికారులు సిద్ధమవ్వాలన్నారు. జిల్లాలోని చెంచు గూడెంలను దత్తత తీసుకున్న అధికారులు సందర్శించి చెంచులకు కల్పించాల్సిన సదుపాయాలపై ప్రణాళిక రూపొందించాలన్నారు. స్పందనలో 175 మంది వినతులు అందజేయగా, వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఎండార్స్ చేస్తూ కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.
ఓటరు జాబితాను ఆధార్‌తో
అనుసంధానం చేయాలి
చెంచుగూడేల్లో సదుపాయాల
కల్పనకు నివేదిక ఇవ్వండి
జిల్లా కలెక్టర్
మనజీర్ జిలానీ శామూన్


