ఈరన్నకు ప్రత్యేక పూజలు
కౌతాళం: మండల పరిధిలోని ఉరుకుంద గ్రామంలో వెలసిన ఈరన్న స్వామి దర్శనానికి సోమవారం వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధికంగా తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. దీంతో స్వామి క్షేత్రంలో భక్తులతో సందడి నెలకొంది. అర్చకులు స్వామి వారి మూలవిరాట్‌కు తెల్లవారు జామున సుప్రభాత సేవ, మహామంగళహారతి, పంచామృతాభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించి ఫలపుష్పాలతో ఆలంకరించారు. అనంతరం భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. కొందరు భక్తులు ఆలయ ఆవరణలో పిండి వంటలు వండి స్వామికి నైవేద్యం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు.
దరఖాస్తుల స్వీకరణ
డోన్ టౌన్: ఉపాధి శిక్షణా శాఖ ఆధ్వర్యంలో నేషనల్ కౌన్సిల్ ఫర్ ఒకేషనల్ ట్రైనింగ్ సెంటర్ నిర్వహించే ఏఐటీటీ జూలై – 2026 పరీక్షలకు ప్రైవేట్ అభ్యర్థులుగా హాజరగుటకు అర్హులైన వారిచే నేటి నుంచి జనవరి 28వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ప్రభుత్వ ఐటీఐ కళాశాలల జిల్లా కన్వీనర్, డోన్ ప్రభుత్వ ఐటీఐ ప్రిన్సిపాల్ ప్రసాద్ రెడ్డి సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. అభ్యర్థులకు 21 ఏళ్లు నిండి సంబంధిత ట్రేడ్‌లలో కనీసం మూడేళ్ల అనుభవం ఉండాలని పేర్కొన్నారు. దరఖాస్తులను సమీపంలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఐటీఐలలో పొందవచ్చని, ప్రవేశ రుసుం రూ.500 చెల్లించాల్సి ఉందన్నారు. మరిన్ని వివరాలకు ఐటీఐలలో సంప్రదించాలన్నారు.


