సైనికుల కుటుంబాలకు అండగా నిలుద్దాం
కర్నూలు(సెంట్రల్): దేశ రక్షణ కోసం ప్రాణాలు ఫణంగా పెట్టి సేవలందిస్తున్న సైనికుల కుటుంబాలకు అండగా నిలవాలని కలెక్టర్ డాక్టర్ ఎ.సిరి ప్రజలకు పిలుపునిచ్చారు. సోమవారం కలెక్టరేట్‌లోని సుయన ఆడిటోరియంలో మెప్మా మహిళలు సేకరించిన రూ.2 లక్షలను సాయుధ దళాల సంక్షేమ నిధికి కలెక్టర్ చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. కర్నూలు, ఆదోని, ఎమ్మిగనూరు, గూడూరు మునిసిపాలిటీల్లోని పొదుపు మహిళలు తమవంతు సాయంగా రూ.2 లక్షలను సేకరించడం అభినందనీయమన్నారు. సైనిక కుటుంబాలను ఆదుకోవడానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. మెప్మా పీడీ శ్రీనివాసులు, జిల్లా సైనిక సంక్షేమాధికారి రత్నరూత్, జిల్లా సమాఖ్య ప్రెసిడెంట్ టి.పద్మ పాల్గొన్నారు.
శ్రీశైలంటెంపుల్: శ్రీశైల దేవస్థానం మల్లికార్జున సదన్ కౌంటర్‌లో విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగిని సోమవారం ఈఓ ఎం.శ్రీనివాసరావు విధుల నుంచి తొలగించారు. అలాగే వసతి విభాగం ఇన్‌చార్జ్‌గా ఉన్న దేవస్థానం పీఆర్వో టీ.శ్రీనివాసరావుకు షోకాజ్ నోటీసు జారీ చేశారు. గత శుక్రవారం మల్లికార్జున సదన్‌లో వసతి పొందేందుకు హిందీ భక్తులు రాగా వారి నుంచి డబ్బులు తీసుకుని దేవస్థానానికి జమ చేయకుండా కౌంటర్ ఉద్యోగి తన జేబులో వేసుకున్నాడు. ఈ విషయంపై ‘సాక్షి’ దినపత్రికలో ఈ నెల 26న ‘భక్తులకు బిల్లు ఇవ్వకుండా..’ అనే శీర్షికతో వార్త ప్రచురితమైంది. దీంతో స్పందించిన ఈఓ ఘటనపై విచారణ చేయించారు. కౌంటర్ ఉద్యోగి అవినీతికి పాల్పడినట్లు నివేదిక అందడంతో అతన్ని విధుల నుంచి తొలగించారు. అలాగే వసతి విభాగం ఇన్‌చార్జ్ ఏఈఓగా ఉన్న పీఆర్వో టీ.శ్రీనివాసరావు విధుల పట్ల నిర్లక్ష్యం ప్రదర్శించారని పేర్కొంటూ షోకాజ్ నోటీసు జారీ చేశారు. వారం రోజుల్లో లిఖితపూర్వక వివరణ ఇవ్వాలని నోటీసులో పేర్కొన్నారు.
దేశ సేవలో భాగస్వాములు కావాలి
కర్నూలు(హాస్పిటల్): దంత వైద్యులు వైద్యవృత్తిలోనే గాకుండా ఐఏఎస్, ఐపీఎస్ లాంటి జాతీయ స్థాయి ఉద్యోగాలు సాధించి దేశ సేవ చేయాలని డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ వీసీ డాక్టర్ పి.చంద్రశేఖర్ సూచించారు. నగర శివారులోని జి.పుల్లారెడ్డి దంత వైద్య కళాశాల 15వ స్నాతకోత్సవం సోమవారం ఘనంగా నిర్వహించారు. బీడీఎస్, ఎండీఎస్‌లో ఉత్తీర్ణత సాధించిన పట్టభద్రులకు వీసీ చేతుల మీదుగా సర్టిఫికెట్లు, మెడల్స్ ప్రదానం చేశారు. వీసీతో పాటు ప్రిన్సిపాల్ డాక్టర్ సంపతి నాగలక్ష్మిరెడ్డి మాట్లాడారు. విద్య ఉన్నత శిఖరాలకు చేరుస్తుందని, వైద్యులు సమాజానికి ఉపయోగపడే విధంగా జీవితాన్ని తీర్చిదిద్దుకోవాలన్నారు. సెక్రటరీ పి.సుబ్బారెడ్డి, డైరెక్టర్ డాక్టర్ మురళీధర్‌రెడ్డి, డాక్టర్ దుగ్గినేని శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.
2 నుంచి క్రికెట్ ఎంపిక పోటీలు
కర్నూలు (టౌన్): స్థానిక స్పోర్ట్స్ అథారిటీ ఔట్‌డోర్ స్టేడియంలోని క్రికెట్ నెట్స్‌లో జనవరి 2, 3 తేదీల్లో అండర్– 14 బాలుర విభాగంలో ట్యాలెంట్ స్పాటింగ్ ఎంపిక పోటీలు నిర్వహించనున్నట్లు జిల్లా క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి కె.దేవేంద్ర గౌడ్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. 2011 సెప్టెంబర్ 1 తర్వాత జన్మించిన క్రీడాకారులు అర్హులని పేర్కొన్నా రు. క్రీడాకారులు జనన ఽధ్రువీకరణ పత్రం, ఆధార్ కార్డుతో హాజరు కావాలన్నారు.
సైనికుల కుటుంబాలకు అండగా నిలుద్దాం


