నల్లగొండ : పేదల సంక్షేమమే ధ్యేయంగా ప్రజా ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడి్‌డ్ తెలిపారు. కొత్తగా మంజూరైన చేయూత పింఛన్ల మంజూరు పత్రాలను శుక్రవారం నల్లగొండలోని ఏచూరి గార్డెన్స్‌లో లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భవిష్యత్‌లో ఆసరా పింఛన్ల మొత్తాన్ని రూ.4 వేలకు పెంచే అవకాశం ఉందన్నారు. పింఛన్లు రాని అర్హులు ఆందోళన చెందకుండా కొత్తగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. నల్లగొండలో పేదల కోసం ఇందిరమ్మ టవర్స్ నిర్మించి 480 ఇళ్లను పేదలకు అందించనున్నట్లు తెలిపారు. తాను పదవిలో ఉన్నా, లేకున్నా ప్రజల కోసం పనిచేసే వ్యక్తినని, ఎలాంటి సమస్యలు ఉన్నా తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. మేయర్ చైతన్య మాట్లాడుతూ నల్లగొండ కార్పొరేషన్ పరిధిలో కొత్త పింఛన్ల కోసం 2,430 దరఖాస్తులు రాగా, వాటిలో 2,036 దరఖాస్తులు అర్హత సాధించాయని వివరించారు. ఎమ్మెల్సీ శంకర్‌నాయక్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం చేయూత పెన్షన్లు అందిస్తోందన్నారు. మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి మాట్లాడుతూ కొత్తగా మంజూరైన పింఛన్ల నగదు ఈ నెల 19వ తేదీ నుంచి లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ అవుతుందని తెలిపారు.
జిల్లాలో 27,255 మందికి కొత్త పెన్షన్లు..
కలెక్టర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ జిల్లాలో ప్రతినెలా 1,97,262 మందికి పింఛన్లు పంపిణీ చేస్తున్నామని, కొత్తగా 27,255 మందికి పింఛణ్లు మంజూరయ్యాయని తెలిపారు. నల్ల గొండ నియోజకవర్గానికి 4,259 కొత్త పింఛణ్లు వచ్చాయని వెల్లడించారు. కార్యక్రమంలో శిక్షణ సహాయ కలెక్టర్ శ్రీకాంత్‌రెడ్డి, డీఆర్డీఓ శేఖర్‌రెడ్డి, డిప్యూటీ మేయర్ అమీర్ అలీ, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఆఫీజ్ ఖాన్, పాల్గొన్నారు.
సమీక్షలో మాట్లాడుతున్న మంత్రి కోమటిరెడ్డి, చిత్రంలో మేయర్ చైతన్య, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ
ఫ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
ఫ చేయూత పింఛన్ లబ్ధిదారులకు మంజూరు పత్రాల పంపిణీ
ధాన్యం కొనుగోళ్లు పూర్తి చేయాలి
నల్లగొండ : వానాకాలం ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేసి పది రోజుల్లో పూర్తి చేయాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ శంకర్ నాయక్, మేయర్ బుర్రి చైతన్య, కలెక్టర్ చంద్రశేఖర్తో కలిసి ధాన్యం కొనుగోళ్లపై మంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇప్పటివరకు 100 కేంద్రాలు ప్రారంభమయ్యాయని, 65 కేంద్రాల్లో కొనుగోళ్లు మొదలయ్యాయని వివరించారు. ఆయా కేంద్రాలకు ఇప్పటివరకు 55,174 మెట్రిక్ టన్నుల ధాన్యం వచ్చిందని చెప్పారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎల్‌నినో పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని తాగునీరు, సాగునీరు, విద్యుత్ వినియోగం, ఆరుతడి పంటల సాగుపై ప్రజలకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. విద్యుత్ సరఫరాపై ఎస్‌ఈ శ్రీనివాసరావును మంత్రి ఆరా తీయగా, జిల్లాలో వ్యవసాయానికి ప్రస్తుతం 14 గంటలపాటు సరఫరా చేస్తున్నామని, ఎలాంటి ఇబ్బందులు లేవని ఆయన వివరించారు. నల్లగొండ పట్టణంలోని మామిళ్లగూడెం సమీపంలో ఇందిరమ్మ టవర్ల నిర్మాణానికి ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపించాలని కలెక్టర్‌ను ఆదేశించారు. ఛాయా సోమేశ్వరస్వామి ఆలయాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేయనున్న నేపథ్యంలో చందనపల్లి డంపింగ్ యార్డును మరోచోటికి తరలించాలని మంత్రి ఆదేశించారు.


