రామగిరి (నల్లగొండ) : చారిత్రాత్మక కట్టడాలు, పవిత్ర దేవాలయాలను భవిష్యత్ తరాల కోసం సంరక్షించుకోవాల్సిన బాధ్యత సమాజంలోని ప్రతి ఒక్కరిపైనా ఉందని కలెక్టర్ చంద్రశేఖర్ అన్నారు. బుధవారం నల్లగొండ సమీపంలోని పానగల్ ఛాయా సోమేశ్వరస్వామి దేవాలయం వద్ద ‘ఇండియన్ నేషనల్ ట్రస్ట్ ఫర్ ఆర్ట్ అండ్ కల్చర్ ఫర్ హెరిటేజ్’ (ఇంటాక్) తెలంగాణ చాప్టర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘వారసత్వ నడక’ (హెరిటేజ్ వాక్)ను ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ఆలయంలో పూజలు చేసి గర్భగుడిలోని శివలింగంపై పడే ‘ఛాయ’ (నీడ) వెనుక ఉన్న వైజ్ఞానిక, శిల్పకళా రహస్యాన్ని ఆలయ పూజారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 12వ శతాబ్దం నాటి కాకతీయుల అద్భుత శిల్పకళకు సజీవ సాక్ష్యం ఛాయా సోమేశ్వరస్వామి ఆలయమన్నారు.. చారిత్రక నిర్మాణాల పరిరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్న ఉందన్నారు. రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఛాయా సోమేశ్వర స్వామి దేవాలయ సమగ్ర అభివృద్ధికి ప్రత్యేక బడ్జెట్ కేటాయించారని వివరించారు. ఇంటాక్ సంస్థ పానగల్ క్షేత్రంలో వారసత్వ నడకను ప్రారంభించడం అభినందనీయమన్నారు. ఇంటాక్ న్యూఢిల్లీ చైర్మన్ అశోక్ సింగ్ ఠాకూర్ మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా ఉన్న పురాతన కట్టడాలను సంరక్షించడం, వాటి పూర్వ వైభవాన్ని పునరుద్ధరించడమే తమ సంస్థ ప్రధాన ఉద్దేశమని వెల్లడించారు. కార్యక్రమంలో హెరిటేజ్ డైరెక్టర్ ప్రొఫెసర్ అర్జున్‌రావు, శ్యామ్ ప్రసాద్‌రెడ్డి, ప్రతినిధులు మణికొండ వేదకుమార్, సజ్జాద్ సాహిద్, సముద్రాల ధనుంజయ్, ఆడేపు రమేష్, కూరెళ్ల శ్రీనివాస్, ఇడికోజు శ్రీనివాసాచారి, అంబటి వెంకన్న, పల్లె సతీష్ పాల్గొన్నారు.
ఫ కలెక్టర్ చంద్రశేఖర్
ఫ ఛాయా సోమేశ్వరాలయం వద్ద ‘హెరిటేజ్ వాక్’


