నేటి నుంచి కొత్త పింఛన్ల మంజూరు పత్రాల పంపిణీ
నల్లగొండ మున్సిపాలిటీలో అత్యధికం..
మండలాలు, మున్సిపాలిటీల వారీగా పింఛన్ల కోసం వచ్చిన దరఖాస్తులను పరిశీలిస్తే నల్ల గొండ మున్సిపాలిటీలో అత్యధికంగా 2,430 వచ్చాయి. వీటిలో 1,902 దరఖాస్తులకు డీఆర్‌డీఓ స్థాయిలో ఆమోదం లభించింది. మిర్యాలగూడ మున్సిపాలిటీలో 1,560, కట్టంగూర్‌లో 1,354, మిర్యాలగూడ మండలంలో 1,351, శాలిగౌరారం మండలంలో 1,279 దరఖాస్తులు నమోదయ్యాయి. మరోవైపు నందికొండ మున్సిపాలిటీలో అత్యల్పంగా 190 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. వాటిలో 175 దరఖాస్తులకు ఆమోదం లభించింది.
నల్లగొండ : చేయూత పింఛన్ల కోసం ఎదురుచూస్తున్న దరఖాస్తుదారులకు ప్రభుత్వం శుభవార్త అందించింది. అర్హులైన వారికి ఈ నెల 12 నుంచి 18వ తేదీ వరకు మంజూరు పత్రాలను పంపిణీ చేయాలని సెర్ప్ (గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ) ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధుల సమక్షంలో లబ్ధి దారులకు మంజూరు పత్రాలు అందజేయనున్నారు.
జిల్లాలో మొత్తం దరఖాస్తులు 32,995
జిల్లాలో చేయూత కొత్త పింఛన్ల కోసం మొత్తం 32,995 దరఖాస్తులు వచ్చాయి. వీటన్నింటినీ పరిశీలన కోసం ట్యాగ్ చేశారు. డీఆర్‌డీఓ స్థాయిలో 28,594 దరఖాస్తులకు ఆమోదం లభించింది. వచ్చిన మొత్తం దరఖాస్తుల్లో వెరిఫికేషన్ అధికారి స్థాయిలో 29,303 మందిని అర్హులుగా గుర్తించగా, 3,655 దరఖాస్తులను అనర్హమైనవిగా తేల్చారు. మరో 33 దరఖాస్తులు ఆన్‌హోల్డ్‌లో, నాలుగు దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. ఎంపీడీవో స్థాయిలో 29,470 దరఖాస్తులకు ఆమోదం లభించగా, 3,477 దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యాయి. మరో 11 దరఖాస్తులు ఈ స్థాయిలో పెండింగ్‌లో ఉన్నాయి. లైన్ డిపార్ట్‌మెంట్ల వద్ద 876 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. అన్నింటినీ పరిశీలించి, సంబంధిత స్థాయిల్లో ఆమోదాలు పూర్తి చేయాలని కలెక్టర్లను సెర్ప్ ఆదేశించింది.
పెండింగ్ దరఖాస్తులపై ప్రత్యేక దృష్టి...
జిల్లాలో లైన్ డిపార్ట్‌మెంట్ల వద్ద 876 దరఖాస్తులు పెండింగ్‌లో ఉండగా, అత్యధికంగా నల్లగొండ మున్సిపాలిటీలో 134, మునుగోడులో 71, మిర్యాలగూడ మున్సిపాలిటీలో 65, నకిరేకల్ మున్సిపాలిటీలో 56 దరఖాస్తులు ఉన్నాయి. ఎంపీడీఓ స్థాయిలో అత్యధికంగా నల్లగొండ మున్సిపాలిటీలో 392, మునుగోడులో 313, మిర్యాలగూడ మున్సిపాలిటీలో 239 దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యాయి. ఈ నేపథ్యంలో పెండింగ్ దరఖాస్తుల పరిశీలన, అర్హుల ఎంపిక, మంజూరు పత్రాల తయారీ, పంపిణీ ప్రక్రియను కలెక్టర్లు స్వయంగా పర్యవేక్షిస్తున్నారు.


