● నల్లగొండ మునుగోడు రోడ్డులోని హౌసింగ్ బోర్డులో నిర్మాణం
● ఒక్కో టవర్‌లో 40 ఫ్లాట్లు,
మొత్తం 480 ఇళ్లు
● ఫ్లాట్ ధర రూ.8.50 లక్షలు,
రూ.5 లక్షలు ప్రభుత్వ సబ్సిడీ
● డిసెంబర్ 5 వరకు దరఖాస్తులు
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : పట్టణంలో సొంతిల్లు లేని పేదల సొంతింటి కల సాకారం దిశగా మరో అడుగుపడింది. నల్లగొండ పట్టణంలోని మునుగోడు రోడ్డులో ఉన్న హౌసింగ్ బోర్డు స్థలంలో ఇందిరమ్మ టవర్స్ నిర్మాణానికి రంగం సిద్ధమైంది. సుమారు ఆరు ఎకరాల విస్తీర్ణంలో 12 టవర్లను నిర్మించనున్నారు. ఒక్కో టవర్‌లో జీ ప్లస్ 5 చొప్పున 40 ఫ్లాట్లు.. మొత్తం 480 ఇళ్లను అందుబాటులోకి తీసుకురానున్నారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం జీఓ నంబర్ 579 ద్వారా అనుమతులు మంజూరు చేసింది. త్వరలోనే నిర్మాణ పనులు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఒక్కో ఫ్లాట్ నిర్మాణ వ్యయాన్ని రూ.8.50 లక్షలుగా నిర్ణయించారు. ఇందులో ప్రభుత్వం రూ.5 లక్షల సబ్సిడీ అందించనుండగా, మిగిలిన రూ.3.50 లక్షలను లబ్ధిదారులు తమ వాటాగా చెల్లించాల్సి ఉంటుంది. ఈ పథకం ద్వారా పట్టణ పరిధిలో సొంతిల్లు లేని అర్హులైన పేద కుటుంబాలకు సొంతింటి అవకాశం కలగనుంది.
ఆన్‌లైన్‌లో దరఖాస్తుల ఆహ్వానం
నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో నివసించే అర్హులైన పేదలు మీ–సేవ కేంద్రాల ద్వారా ఆన్‌లైన్‌లో డిసెంబర్ 5వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ బి.చంద్రశేఖర్ సూచించారు. దరఖాస్తుదారులకు కార్పొరేషన్ పరిధిలో సొంత ఇల్లు, ప్లాట్ ఉండకూడదని, వార్షిక కుటుంబ ఆదాయం రూ.6 లక్షలకు మించరాదని స్పష్టం చేశారు. ఒక కుటుంబం నుంచి ఒక్కరు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని, దరఖాస్తుదారు తప్పనిసరిగా నల్లగొండ కార్పొరేషన్ పరిధిలో నివాసం ఉండాలని తెలిపారు.
మంత్రి కోమటిరెడ్డికి కృతజ్ఞతలు
– మేయర్ చైతన్య
నల్లగొండకు 480 ఇందిరమ్మ ఫ్లాట్లను ఇళ్లను మంజూరు చేయడంపై నగర మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి, రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి నల్లగొండ ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలిపారు. సొంతిల్లు లేని పేద, ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాల సొంతింటి కలను నెరవేర్చడమే ఇందిరమ్మ టవర్స్ పథకం లక్ష్యమని పేర్కొన్నారు. పట్టణ అభివృద్ధితోపాటు పేదల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు.


