నాలుగు శాఖలకు ఉచ్చు | - | Sakshi
Sakshi News home page

నాలుగు శాఖలకు ఉచ్చు

Nov 8 2026 5:23 AM | Updated on Nov 8 2026 5:23 AM

కార్పొరేషన్‌లో పోలీసుల పరిశీలన

ఫ కారుణ్య నియామకం కేసులో పది మంది అరెస్ట్‌ ఫ ఎస్పీ పర్యవేక్షణలో ముమ్మర దర్యాప్తు

నల్లగొండ టూటౌన్‌ : అక్రమంగా జరిగిన ఒక్క కారుణ్య నియామకం నాలుగు ప్రభుత్వ శాఖల ఉద్యోగులకు ఉచ్చు బిగుస్తోంది. తీగ కదిలితే డొంక కదిలిన మాధిరిగా ఈ అక్రమాల బాగోతం బయట పడుతోంది. వైద్య ఆరోగ్యశాఖలో పనిచేసి రిటైర్డ్‌ అయిన చామకూరి వెంకటేశ్వర్లుకు తప్పుడు తేదీతో జారీ చేసిన మరణ ధ్రువీకరణ పత్రం, అతని కుమారుడి కారుణ్య నియామకం, నకిరేకల్‌ తహసీల్దార్‌ కార్యాలయంలో జారీచేసిన ఫ్యామిలీ మెంబర్‌ సర్టిఫికెట్లకు సంబంధించిన కేసులో ఇప్పటి వరకు పది మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. మృతుడి భార్య, అతని కుమారుడు, శాలిగౌరారం సీనియర్‌ అసిస్టెంట్‌, ఓ ఏఓ, డీఎంహెచ్‌ఓ కార్యాలయం సూపరింటెండెంట్‌, డీఎంహెచ్‌ఓ సీసీ, మరో సీనియర్‌ అసిస్టెంట్‌, జూనియర్‌ అసిస్టెంట్‌, ఓ రెవెన్యూ అధికారి, ఒక వార్డు ఆపీసర్‌ ఇలా మొత్తంగా పది మందిని పోలీసులు అదుపులోకి తీసుకొని వారిని ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. దామరచర్ల పీహెచ్‌సీలోని జూనియర్‌ అసిస్టెంట్‌ నుంచి పోలీసులు స్టేట్‌మెంట్‌ తీసుకున్నారు.

అన్ని కోణాల్లోనూ విచారణ..

అక్రమంగా జరిగిన కారుణ్య నియామకంలో వైద్య ఆరోగ్యశాఖ, రెవెన్యూ, మున్సిపల్‌, పోలీస్‌ శాఖకు సంబంధించిన ఉద్యోగుల ప్రమేయం ఉన్నట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది. ఎస్పీ శరత్‌చంద్ర పవార్‌ పర్యవేక్షణలో దర్యాప్తు ముమ్మరంగా జరుగుతోంది. కేసును చాలెంజ్‌గా తీసుకున్న పోలీస్‌ శాఖ అన్ని కోణాల్లో విచారించి నిజాలను నిగ్గుతేల్చే పనిలో ఉంది. ఒక్కో ఉద్యోగిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించిన పోలీసులు వారు చెప్పిన వివరాలను క్రోడీకరించుకొని ఈ కేసులో లింకులు ఉన్న అందరిని అదుపులోకి తీసుకొని విచారణ జరుపుతున్నారు. ఈ కేసులో ప్రత్యక్షంగా సంబంధం ఉన్న మరికొందరిని సైతం కూడా అదుపులోకి తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలిసింది.

నీలగిరి మున్సిపల్‌ కార్పొరేషన్‌ కార్యాలయంలో శనివారం పోలీసులు విచారణ జరిపారు. కమిషనర్‌ వంశీకృష్ణ చాంబర్‌కు వెళ్లి వివరాలు అడిగి తెలుసుకున్నారు. మరణ ధ్రువీకరణలో పత్రం జారీలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉద్యోగులను పిలిపించి విచారించారు. మరణ ధ్రువీకరణ పత్రం జారీ చేసిందెవరు.. డిజిటల్‌ కీ ఎవరి దగ్గర ఉంటుంది.. చిరునామా మార్చిందెవరు.. ఎందుకు మార్చారు అనే కోణంలో విచారణ జరిపి దస్త్రాలను పరిశీలించినట్లు తెలిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement