నల్లగొండ : జాతీయ మానవ హక్కుల కమిషన్ స్పెషల్ మానిటర్ డాక్టర్ అనిమేష్ భట్టాచార్య మంగళవారం పానగల్లులో మిషన్ భగీరథ నీటి శుద్ధి కేంద్రాన్ని, నీటి నాణ్యత ప్రయోగశాల (ఎన్‌ఏబీఎల్ ల్యాబ్)ను సందర్శించారు. ప్రయోగశాలలో నిర్వహిస్తున్న రసాయనిక, మైక్రోబయోలాజికల్ పరీక్షల వివరాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. పరీక్షలకు సంబంధించిన రికార్డులను పరిశీలించారు. పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాల నుంచి సేకరించిన నీటి నమూనాల పరీక్షల నివేదికను తనిఖీ చేశారు. పరీక్షల తీరు, నాణ్యతా ప్రమాణాల అమలుపై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. ఇదే తరహా నీటి శుద్ధి, నాణ్యత పర్యవేక్షణ విధానాలను ఇతర రాష్ట్రాల్లో కూడా అమలు చేసేలా చర్యలు తీసుకుంటే మంచిదన్నారు. కార్యక్రమంలో మిషన్ భగీరథ ఎస్‌ఈ నాగేశ్వరరావు, ఈఈ శాంతకుమారి, ఏఈఈ సంతోష్, ప్రయోగశాల ఇన్‌చార్జి పి.వీరారెడ్డి, బి.సుజాత, ఎస్.రేణుక, ప్రశాంతి, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.


