బియ్యం ధరలపై అధికారుల నిఘా | - | Sakshi
Sakshi News home page

బియ్యం ధరలపై అధికారుల నిఘా

Nov 4 2026 1:56 AM | Updated on Nov 4 2026 1:56 AM

మిర్యాలగూడ : బహిరంగ మార్కెట్‌లో బియ్యం ధరలకు కళ్లెం వేసేందుకు పౌరసరఫరాల శాఖ అధికారులు రంగంలోకి దిగారు. ప్రభుత్వం ఇటీవల బియ్యం విక్రయ ధరలను నిర్ణయించినప్పటికీ కొందరు వ్యాపారులు అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు గుర్తించారు. హైదరాబాద్‌లోని టోలిచౌక్‌, రాణిగంజ్‌ తదితర ప్రాంతాల్లో కొందరు వ్యాపారులు నిర్ణీత ధరలకు మించి బియ్యం విక్రయిస్తున్నట్లు అధికారులకు సమాచారం అందింది. దీంతో ఆయా ప్రాంతాల్లోని బియ్యం దుకాణాల్లో అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా తమకు బియ్యం సరఫరా చేసే హోల్‌సేల్‌ వ్యాపారులు, మిల్లర్లు ధరలు పెంచారని, అందుకే తాము కూడా ధరలు పెంచి విక్రయిస్తున్నామని కొందరు దుకాణాదారులు అధికారులకు విన్నవించినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌కు బియ్యం సరఫరా చేస్తున్న మిర్యాలగూడలోని మిల్లులపై అధికారులు దృష్టి సారించారు. ఇందులో భాగంగా మంగళవారం హైదరాబాద్‌కు చెందిన లీగల్‌ మెట్రాలజీ టాస్క్‌ఫోర్స్‌ బృందం, జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారులు సంయుక్తంగా మిర్యాలగూడ పట్టణంలోని మూడు రైస్‌ మిల్లుల్లో తనిఖీలు నిర్వహించారు. బండారు ఆగ్రోటెక్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, మహాతేజ రైస్‌ మిల్‌, మహేంద్రరైస్‌ మిల్లులను పరిశీలించారు. ఈ సందర్భంగా బహిరంగ మార్కెట్‌కు బియ్యం సరఫరాలో ఎలాంటి అంతరాయం కలిగించవద్దని, ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే నిరంతరాయంగా సరఫరా చేయాలని మిల్లర్లకు అధికారులు సూచించారు. కృత్రిమ కొరత సృష్టించడం, ధరల పెంపునకు కారణమయ్యే విధంగా వ్యవహరించడం సరికాదన్నారు. ఈ తనిఖీల్లో డీఎస్‌ఓ వెంకటేశ్వర్లు, హైదరాబాద్‌ లీగల్‌ మెట్రాలజీ టాస్క్‌ఫోర్స్‌, పౌరసఫరాల శాఖ అధికారులు పాల్గొన్నారు.

ఫ మిర్యాలగూడ రైస్‌ మిల్లుల్లో తనిఖీలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement