అసలేం జరిగిందంటే..
వైద్యారోగ్య శాఖలో అక్రమాల బాగోతం
రిటైర్డ్ అయ్యాక..
జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో అక్రమాల పరంపర కొనసాగుతోంది. కార్యాలయంలో పనిచేసే కొందరు ఉద్యోగులు చేస్తున్న అక్రమాల బాగోతం ఒక్కోటి వెలుగులోకి వస్తోంది. గతంలో ఉద్యోగాలను రెగ్యులరైజ్ చేయిస్తామంటూ కొందరు ఉద్యోగులు డబ్బులు వసూలు చేయగా.. ప్రస్తుతం ఎలాంటి సర్టిఫికెట్ వెరిఫికేషన్ లేకుండానే కారుణ్య నియామకం కింద ఉద్యోగం కట్టబెట్టారు. ఈ వ్యవహారంలో డీఎంహెచ్‌ఓ కార్యాలయంలో పనిచేసే ఉద్యోగులు భారీగా డబ్బులు దండుకుంటున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సదరు ఉద్యోగులపై గతంలోనే ఆరోపణలు వచ్చినా వారికి.. అక్కడే కొనసాగిస్తుండడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.
డీఎంహెచ్‌ఓను బురిడి కొట్టిస్తున్న వైనం
డీఎంహెచ్‌వో కార్యాలయంలో పనిచేసే సదరు ఉద్యోగులు ఉద్యోగాల పేరుతో లక్షల రూపాయలు దండుకున్నట్లు ఆరోపణలున్నాయి. వారు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని తప్పుదోవ పట్టిస్తూ పలు అక్రమాలకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. ప్రైవేట్ ఆసుపత్రులకు అనుకూలంగా వ్యవహరిస్తూ పెద్ద ఎత్తున ముడుపులు దండుకున్నారన్న ఆరోపణలు సైతం ఉన్నాయి. మే నెలలో సెకండ్ ఏఎన్‌ఎంలను రెగ్యులరైజ్ చేయిస్తామంటూ 20 మంది నుంచి డబ్బులు వసూలు చేశారు. ఈ కేసు మరచిపోకముందే రిటైర్ అయిన ఉద్యోగి కుమారుడికి నిబంధనలకు విరుద్ధంగా కారుణ్య నియామకం కింద ఉద్యోగం కట్టబెట్టిన విషయం వెలుగులోకి వచ్చింది. ఈ వ్యవహారంలో సదరు ఇద్దరు ఉద్యోగులు వైద్యారోగ్యశాఖ అధికారిని కూడా బురిడీ కొట్టించినట్లు విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఫైల్ జనరేట్ అయిందెక్కడ?
వెంకటేశ్వర్లు ఉద్యోగంలో ఉండగానే మరణించినట్లుగా ధ్రువీకరణ పత్రాన్ని సృష్టించి, దానిని ఆధారం చేసుకొని వైద్యారోగ్యశాఖకు ఇద్దరు ఉద్యోగులు చక్రం తిప్పారు. మృతుడి కుమారుడితో ఒప్పందం చేసుకొని వ్యవహారం నడిపారు. కారుణ్య నియామకానికి సంబంధించిన ఫైల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుంచి ప్రాసెస్ చేసి డీఎంహెచ్‌వో కార్యాలయానికి పంపించాలి. కానీ అక్కడి వైద్యాధికారి సూర్యశిల్ప తాను ఆ ఫైల్‌ను ప్రాసెస్ చేయలేదని పేర్కొన్నారు. అసలు ఆ ఫైల్ ఎక్కడ జనరేట్ అయింది? పీహెచ్‌సీలోనా? డీఎంహెచ్‌ఓ కార్యాలయంలోనా? ఎవరు ప్రాసెస్ చేశారు? ఎవరు ఆమోదించారు? సర్వీసు రిజస్టర్ చూడకుండానే, సర్టిఫికెట్ వెరిఫికేషన్ లేకుండా ఎలా ఉద్యోగం ఇచ్చారన్నది తేలాల్సి ఉంది.
ఫ రిటైర్డ్ ఉద్యోగి మరణించినా.. సర్వీస్‌లో ఉన్న తేదీతో మరణ ధ్రువీకరణ
ఫ ఎలాంటి వెరిఫికేషన్ లేకుండానే ఉద్యోగం కట్టబెట్టిన వైనం
ఫ భారీగా ముడుపులు చేతులు మారినట్లు ఆరోపణలు
ఫ చక్రం తిప్పిన డీఎంహెచ్‌ఓ కార్యాలయం ఉద్యోగి
ఫ గతంలోనూ రెగ్యులరైజ్
చేయిస్తామంటూ అతని వసూళ్ల దందా
వైద్య ఆరోగ్య శాఖలో పని చేసిన నకిరేకల్‌కు చెందిన చామకూరి వెంకటేశ్వర్లు 2025 మే 31న ఉద్యోగ విరమణ పొందారు. ఈ మేరకు సర్వీసు బుక్‌లోనూ ఈ అంశాన్ని రికార్డు చేశారు. ఆ తరువాత ఆరు నెలలకు ఆయన అనారోగ్యం కారణంగా వెంకటేశ్వర్లు 2025 నవంబరు 17న సూర్యాపేట ఆసుపత్రిలో మరణించారు. అయితే ఆయన 2025 మే 28వ తేదీన అంటే రిటైర్‌మెంట్‌కు మూడు రోజుల ముందుగా మరణించినట్లుగా మరణ ధ్రువీకరణ పత్రం నల్లగొండ మున్సిపాలిటీ నుంచి జారీ చేయడం గమనార్హం. సాధారణంగా మనిషి ఎక్కడ మరణిస్తే అక్కడినుంచే ధ్రువీకరణ పత్రం తీసుకోవాలి. కానీ సూర్యాపేటలో మరణిస్తే నల్లగొండ మున్సిపాలిటీ నుంచి మరణ ధ్రువీకరణ పత్రం ఇచ్చారు. దానిని ఆధారంగా చేసుకొని వెంకటేశ్వర్లు కొడుకు రాజుకు జిల్లా వైద్యారోగ్యశాఖ కారుణ్య నియామకం కింద ఉద్యోగం ఇచ్చేసింది. ఈ వ్యవహారంలో డీఎంహెచ్‌వో కార్యాలయంలో పని చేసే ఇద్దరు ముఖ్య ఉద్యోగులే కీలకంగా వ్యవహరించినట్లు తెలిసింది.
సాక్షి ప్రతినిధి, నల్లగొండ :
రూ.25 లక్షలకు డీల్?
ఈ వ్యవహారంలో రూ.25 లక్షలకు బేరం కుదుర్చుకున్నట్లు తెలిసింది. అందులో డీఎంహెచ్‌ఓ కార్యాలయంలో ఉద్యోగులకు రూ.16 లక్షలు, నల్లగొండ మున్సిపాలిటీలో జనన, మరణ ధ్రువీకరణ పత్రాల జారీ విభాగంలో రూ.9 లక్షలు చెల్లించేలా ఒప్పందం చేసుకున్నట్లు సమాచారం. అంతేకాదు గతంలోనూ సెకండ్ ఏఎన్‌ఎంల రెగ్యులరైజేషన్ విషయంలోనూ డీఎంహెచ్‌ఓ కార్యాలయంలోని ఉద్యోగి ఒక్కొక్కరి రెగ్యులరైజేషన్‌కు రూ.5 లక్షలకు బేరం కుదుర్చుకొని శాలిగౌరారంలో పనిచేసే అప్పటి సెకండ్ ఏఎన్‌ఎం ద్వారా అడ్వాన్స్ కింద రూ.1 లక్ష చొప్పున వసూలు చేశారు. శాలిగౌరారం, కట్టంగూర్, నార్కట్‌పల్లి మండలాల్లోని సెకండ్ ఏఎన్‌ఎంలు డబ్బులు ఇచ్చారు. దీనిపై బాధితులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేయడంతో కట్టంగూరు పోలీసులు కేసు నమోదు చేశారు. సదరు ఏఎన్‌ఎంతోపాటు మరో స్టాఫ్ నర్సుపైనా వైద్యారోగ్యశాఖ చర్యలు చేపట్టింది.


