ప్రత్యామ్నాయ పంటలు వేయాలి | - | Sakshi
Sakshi News home page

ప్రత్యామ్నాయ పంటలు వేయాలి

Oct 27 2026 2:02 AM | Updated on Oct 27 2026 2:02 AM

వైద్య ఖర్చులకై నా ఉపయోగపడుతుందని ఆశ.. పదేళ్లుగా దరఖాస్తులే.. పింఛన్‌ లేదు.. ఆరేళ్లుగా ఎదురుచూస్తున్నా..

నాకు 75 ఏళ్లు వచ్చినా వృద్ధాప్య పింఛన్‌ అందడం లేదు. గతంలో దరఖాస్తు చేసుకుంటే ఒక్క నెల మాత్రమే పింఛన్‌ వచ్చింది. ఆ తర్వాత నిలిచిపోయింది. మళ్లీ దరఖాస్తు చేసుకున్నా ఫలితం లేదు. వృద్ధాప్యంలో కనీసం వైద్య ఖర్చులకై నా పింఛన్‌ డబ్బులు ఉపయోగపడతాయని ఎదురుచూస్తున్నా. – బొడ్డుపల్లి నారాయణ,

బట్టుగూడెం, పెద్దవూర మండలం

ప్రమాదంలో కాలు విరగడంతో అంగవైకల్యంతో బాధపడుతున్నా. పదేళ్లుగా పింఛన్‌ కోసం దరఖాస్తు చేసుకుంటున్నా. 78 ఏళ్ల వయసులో పనికి వెళ్లలేక, సొంత పనులు కూడా చేసుకోలేక ఇబ్బందులు పడుతున్నా. అధికారుల చుట్టూ తిరిగినా ఫలితం లేదు. ఇప్పటికై నా ప్రభుత్వం పింఛన్‌ మంజూరు చేసి ఆదుకోవాలి.

– వేముల దుర్గయ్య, బంగారిగడ్డ, చండూరు

నాకు 65 ఏళ్లు దాటినా ఆరు సంవత్సరాలుగా వృద్ధాప్య పింఛన్‌ కోసం దరఖాస్తు చేసుకుంటూనే ఉన్నా. ఇప్పటికీ పింఛన్‌ మంజూరు కాలేదు. తాజాగా దరఖాస్తు చేసుకున్నా జాబితాలో పేరు లేదని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికై నా అర్హతను గుర్తించి పింఛన్‌ మంజూరు చేయాలి.

– తీగల బాలయ్య, సర్వారం గ్రామం,

తిప్పర్తి మండలం

పట్టభద్రులు ఓటరు నమోదు చేసుకోవాలి

నల్లగొండ : వరంగల్‌–ఖమ్మం–నల్లగొండ గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ నియోజకవర్గంలో అర్హులైన పట్టభద్రులందరూ నవంబర్‌ 6వ తేదీలోగా ఓటరుగా నమోదు చేసుకోవాలని కలెక్టర్‌ చంద్రశేఖర్‌ పిలపునిచ్చారు. ఆయన కలెక్టరేట్‌లో సోమవారం హైదరాబాద్‌ నుంచి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్‌రెడ్డితో ఎస్‌ఐఆర్‌ ప్రక్రియ, పట్టభద్రుల ఓటరు నమోదు అంశాలపై జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్‌ మాట్లాడారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదు దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించాలని, సంబంధిత ధ్రువపత్రాలను తనిఖీ చేసిన తర్వాతే నమోదు ప్రక్రియను పూర్తి చేయాలని స్పష్టం చేశారు. ఓటరు నమోదు ప్రక్రియపై ప్రతిరోజూ నివేదికలు సమర్పించడంతోపాటు, ప్రచారం నిర్వహించాలని ఆదేశించారు.

రామగిరి (నల్లగొండ) : ఎల్‌నినో నేపథ్యంతో రైతులు వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్లాలని కలెక్టర్‌ చంద్రశేఖర్‌ సూచించారు. జిల్లా కేంద్రం సమీపంలోని ఆర్జాలబావిలో పీఏసీఎస్‌ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సోమవారం ఆయన.. మేయర్‌ బుర్రి చైతన్యతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రభుత్వం ఏ గ్రేడ్‌ ధాన్యానికి రూ.2,461, కామన్‌ వైరెటీకి రూ.2,441 మద్దతు ధర ప్రకటించిందని, సన్న ధాన్యం పండించిన రైతులకు క్వింటాకు రూ.500 బోనస్‌ ఇస్తుందని తెలిపారు. మద్దతు ధర పొందేందుకు రైతులు నాణ్యతా ప్రమాణాలతో ఉన్న ధాన్యాన్ని కేంద్రాలకు తీసుకురావాలని సూచించారు. ఎల్‌నినో పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల రైతులు సమిష్టి వ్యవసాయం చేసి వరికి బదులుగా తక్కువ నీరు అవసరమయ్యే కూరగాయలు, ఉద్యాన, ఆరుతడి పంటలు సాగు చేయాలని సూచించారు. రైతులకు అవగాహన కల్పించేందుకు ప్రతి మంగళ, శుక్రవారాల్లో రైతు వేదికలలో రైతు నేస్తం కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో రెవెన్యూ అదనపు కలెక్టర్‌ జె.శ్రీనివాస్‌, ఆర్డీఓ వై.అశోక్‌రెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి వినోద్‌ కుమార్‌, జిల్లా సహకార అధికారి మమత, పౌరసరఫరాల శాఖ డీఎం రాంపతి, మార్కెటింగ్‌ ఏడీ ఛాయాదేవి, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ హైమావతి, పీఏసీఎస్‌ చైర్మన్‌ నాగరత్నంరాజు, మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ బుర్రి శ్రీనివాస్‌రెడ్డి, మాజీ జెడ్పీటీసీ గుమ్మల మోహన్‌రెడ్డి, మధుసూదన్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఫ కలెక్టర్‌ చంద్రశేఖర్‌

ఫ ఆర్జాలబావి వద్ద ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement