శాలిగౌరారం : మండలంలోని మనిమద్దె, గురుజాల గ్రామాల్లోని వేబ్రిడ్జిల వద్ద పచ్చి ధాన్యం కొనుగోలు చేస్తున్న మూడు ప్రైవేట్ కేంద్రాలను జిల్లా తూనికలు కొలతల శాఖ అధికారులు సోమవారం తనఖీ చేశారు. టన్ను(1000 కిలోలు)కు 10 కిలోల తక్కువ నమోదు చేసి ధాన్యం కొనుగోళ్లలో మోసాలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు. మోసాలకు పాల్పడుతున్న వేబ్రిడ్జిలను సీజ్ చేసి స్వాధీనం చేసుకోవడంతోపాటు సంబంధిత నిర్వాహకులపై కేసులు నమోదు చేశారు. ఈ సందర్భంగా జిల్లా తూనికలు కొలతల శాఖ అధికారి శ్రీనివాసులు మాట్లాడుతూ రైతులు తమ వ్యవసాయ ఉత్పత్తులను తూకం వేయించే సమయంలో అప్రమత్తంగా ఉండాలన్నారు.
పట్టించుకోని మండల అధికారులు..
మండలంలో నెల రోజులుగా మూడు కేంద్రాల ద్వారా పచ్చి ధాన్యం కొనుగోలు చేస్తున్నా.. అధికారులు పట్టించుకోలేదు. దీంతో వ్యాపారులు తూకంలో మోసానికి పాల్పడుతున్నట్లు సంబంధిత జిల్లా అధికారుల తనిఖీలో బయట పడడం మండల అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనంగా మారింది. మండల అధికారులు ముందుగానే తనిఖీలు చేపడితే తూకంలో మోసాలు జరిగి ఉండేవి కాదని రైతులు అంటున్నారు. ప్రభుత్వం ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాకపోవడం కూడా ప్రైవేట్ కేంద్రాల్లో ధాన్యం విక్రయాలు పెరుగడానికి ఒక కారణంగా మారింది.
ఫ ధాన్యం తూకంలో మోసాలను గుర్తించిన తూనికలు కొలతలశాఖ అధికారులు


