నల్లగొండ అగ్రికల్చర్ : ఎల్‌నినో ప్రభావం కారణంగా జిల్లా అంతటా కరువు పరిస్థితులు నెలకొన్నాయి. రానున్న పది నెలల పాటు గడ్డు పరిస్థితులను ఎదుర్కొవాల్సి వస్తుందని అధికార యంత్రాంగం ప్రజలను అప్రమత్తం చేస్తోంది. ప్రధానంగా తాగునీటితో పాటు జీవాలకు పశుగ్రాసం కొరత ఏర్పడే అవకాశం ఉంది. దీనిని దృష్టిలో పెట్టుకుని జిల్లా యంత్రాంగం పశుగ్రాసం కొరతను నివారించడంతో పాటుగా జిల్లా అంతటా జీవాలకు తాగునీటి అవసరాలను తీర్చేందుకు గాను గ్రామాల్లో నీటి తొట్ల నిర్మాణానికి ప్రతిపాదనలను సిద్ధం చేసింది.
రోజుకు ఐదు కిలోల గ్రాసం
అక్టోబర్ నుంచి డిసెంబర్ నెల వరకు రోజు ఒక్కో మూగ జీవానికి సుమారు 5 కిలోల గ్రాసం కావాలని, దీనికి గాను మొత్తం 2700 కిలోల మెట్రిక్ టన్నుల గ్రాసం అవసరం ఉంటుందని జిల్లా పశుసంవర్ధక శాఖ అంచనాలు వేసింది. అయితే ప్రస్తుతం వివిధ రూపాల్లో 3421 మెట్రిక్ టన్నుల పశుగ్రాసం అందుబాటులో ఉంది. ఇంకా 622 మెట్రిక్ టన్నుల గ్రాసం మిగులుబాటు ఉంది. అయితే.. వచ్చే ఏడాది జూలై వరకు పశుగ్రాసం కొరత ఏర్పడే అవకాశం ఉందని జిల్లా యంత్రాంగం అంచనా వేస్తోంది. అందుకు తగిన ప్రణాళికను రూపొందించి రాష్ట్ర ప్రభుత్వానికి పంపించింది.
రూ.23.12 కోట్లతో ప్రతిపాదనలు..
వచ్చే ఏడాది జూలై నాటికి ఏర్పడనున్న కొరతను నివారించడంతో పాటు మూగజీవాల తాగునీటి అవసరాలను తీర్చడానికి రూ.23.12 కోట్లతో ప్రతిపాదనలు తయారు చేసి ప్రభుత్వానికి పంపించింది. రైతులకు 75 శాతం సబ్సిడీపై 147 మెట్రిక్ టన్నుల గడ్డి విత్తనాలను అందించడానికి రూ.128.18 లక్షలతో, రూ.33.50 లక్షలతో వంద చాప్‌కట్టర్‌లను రైతులకు అందించాలని నిర్ణయించింది. 761 గ్రామాల్లో రూ.380 లక్షలతో ఉపాధి హామీ పథకం ద్వారా నీటి తోట్లను నిర్మించాలని ప్రతిపాదించారు. పాడి గేదెలకు రూ.1750 లక్షలతో 5 వేల మెట్రిక్ టన్నుల దాణాను, రూ.20లక్షలతో 200 మెట్రిక్ టన్నుల మినరల్ మిక్షర్‌ను అందించాలని ప్రతిపాదనలో నివేదించారు.
ఫ పశుగ్రాసం కొరత నివారణకు ప్రభుత్వం ప్రణాళికలు
ఫ రూ.23.12 కోట్లతో వివిధ పనులకు ప్రతిపాదనలు


