65 ఏళ్లు దాటినా అందని ఆసరా..
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : వృద్ధాప్యంలో ప్రభుత్వ నుంచి పింఛన్ అందకపోవడంతో వేలాది మంది ఇబ్బందులు పడుతున్నారు. వయసు మీదపడటంతో పనులు చేసుకునే శక్తి లేక.. కుటుంబంపై ఆధారపడలేక.. కనీస అవసరాలు తీర్చుకునేందుకు నానా తంటాలు పడుతున్నారు. నాలుగున్నరేళ్లుగా కొత్త పింఛన్ల కోసం ఎదురుచూస్తున్నా ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా తమ గోడు పట్టించుకునే వారు లేరని వాపోతున్నారు. దరఖాస్తులు తీసుకుంటున్నారు తప్ప.. కొత్త పింఛన్లు మాత్రం మంజూరు చేయడం లేదని.. తమకు పింఛన్లు ఎప్పుడిస్తారని ప్రశ్నిస్తున్నారు.
2022 తర్వాత ఎదురుచూపులే..
గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత 58 ఏళ్లు నిండిన వారికి వృద్ధాప్య పింఛన్లు మంజూరు చేస్తామని ప్రకటించింది. ఈ మేరకు 2022 జూన్‌లో దరఖాస్తులు స్వీకరించింది. జిల్లాలో మొత్తం 6,110 మంది దరఖాస్తు చేసుకోగా.. వారిలో 5,759 మందిని అర్హులుగా గుర్తించారు. 189 మందిని అనర్హులుగా తేల్చారు. మరో 162 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. అర్హులుగా గుర్తించిన వారిలోనూ కొందరికే పింఛన్లు మంజూరు చేసిన ప్రభుత్వం.. ఆ తర్వాత పట్టించుకోలేదని అర్హులు ఆవేదన చెందుతున్నారు.
హామీలకే పరిమితమైన పెంపు..
అధికారంలోకి వస్తే పింఛన్ మొత్తాన్ని రూ.2 వేల నుంచి రూ.4 వేలకు పెంచుతామని ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. దివ్యాంగుల పింఛన్‌ను రూ.3 వేల నుంచి రూ.6 వేలకు పెంచుతామని ప్రకటించింది. అయితే ఈ హామీలు అమలుకు నోచుకోలేదు. ఎన్నికల అనంతరం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన కార్యక్రమం నిర్వహించి వివిధ సంక్షేమ పథకాల కోసం దరఖాస్తులు స్వీకరించింది. కొత్త పింఛన్ల కోసం కూడా పెద్ద సంఖ్యలో దరఖాస్తులు అందాయి. అయినప్పటికీ వృద్ధాప్య పింఛన్ల మంజూరుపై స్పష్టత లేకపోవడంతో దరఖాస్తుదారులు నిరాశకు గురవుతున్నారు. ఇక.. దివ్యాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలు, గీత కార్మికులు, చేనేత కార్మికులు కూడా కొత్త పింఛన్ల కోసం ఎదురుచూస్తున్నారు. పండుగల సమయంలోనైనా కొత్త పింఛన్లు మంజూరవుతాయని ఆశించిన వారికి నిరాశే ఎదురవుతోంది.
నాలుగున్నరేళ్లుగా వృద్ధాప్య
పింఛన్ల కోసం ఎదురుచూపు
ఫ 2022 తర్వాత కొత్తగా పింఛన్లు మంజూరు చేయని ప్రభుత్వం
ఫ ప్రజాపాలనలో దరఖాస్తులు తీసుకున్నా.. ఫలితం శూన్యం
ఫ ఫించన్లు ఇచ్చి ఆత్మగౌరవంతో బతికేలా చూడాలంటున్న వృద్ధులు
వృద్ధాప్య పింఛన్ కోసం నిరీక్షిస్తున్న వారిలో 65 ఏళ్లు దాటినవారు కూడా ఉన్నారు. వయసు మీదపడడంతో కూలి పనులకు వెళ్లలేక, కొందరు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. మరికొందరు పిల్లలపై ఆధారపడలేక ఇబ్బందులు పడుతున్నారు. వృద్ధాప్యంలో బీపీ, షుగర్‌తోపాటు ఇతర అనారోగ్య సమస్యలు వేధిస్తుంటాయి. క్రమం తప్పకుండా మందులు వాడాల్సి రావడంతో నెలవారీ ఖర్చులు పెరుగుతున్నాయి. ఇలాంటి సమయంలో పింఛన్ అందితే మందులు, నిత్యావసరాలకు కొంతైనా వెసులుబాటు ఉంటుందని వృద్ధులు చెబుతున్నారు. పింఛన్ లేకపోవడంతో చిన్నచిన్న అవసరాలకు కూడా ఇతరులపై ఆధారపడాల్సి వస్తోందని వాపోతున్నారు. వృద్ధాప్యంలో ఆత్మగౌరవంతో బతకాల్సిన తాము ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


