న్యూస్‌రీల్
సోమవారం శ్రీ 21 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2026
నల్లగొండ : జిల్లాలో స్వచ్ఛత కార్యక్రమాలు జోరుగా కొనసాగుతున్నాయి. ‘స్వచ్ఛత స్వభావం–స్వచ్ఛ భారత్, వికసిత భారత్’ నినాదంతో సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు ‘స్వచ్ఛతా హి సేవ–2026’ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ప్రజలు, ప్రజాప్రతినిధులు, విద్యార్థులు, వివిధ శాఖల అధికారులు, పారిశుద్ధ్య సిబ్బందిని భాగస్వాములను చేస్తూ కార్యక్రమాలు చేపడుతున్నారు. కలెక్టర్, జిల్లా స్వచ్ఛ భారత్ మిషన్ గ్రామీణ్ చైర్మన్ బి.చంద్రశేఖర్ ఆదేశాల మేరకు గ్రామాలు, పట్టణాల్లో ప్రత్యేక పారిశుద్ధ్య డ్రైవ్‌లు కొనసాగుతున్నాయి. చెత్త పేరుకుపోయే ప్రాంతాల ప్రక్షాళన, పాఠశాలల్లో అవగాహన కార్యక్రమాలతోపాటు మార్కెట్లు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, చెరువులు, వాగుల వద్ద పరిశుభ్రత కార్యక్రమాలు చేపడుతున్నారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నివారణ, గుట్కా, పాన్‌మసాలా ఉమ్మివేయడంపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.
విద్యార్థులతో స్వచ్ఛత సందేశం
ఈ నెల 17, 18 తేదీల్లో పాఠశాల విద్యార్థులకు ఘన వ్యర్థాల నిర్వహణ కేంద్రాల సందర్శన, వ్యాసరచన, ఉపన్యాసం, గోడచిత్రాల పోటీలు నిర్వహించారు. పాత పుస్తకాలు, బొమ్మలను సేకరించారు. 19, 20 తేదీల్లో చెత్త ఎక్కువగా పేరుకుపోయే ప్రాంతాలను గుర్తించి శ్రమదానం ద్వారా శుభ్రపరచడంతోపాటు సుందరీకరణ చేపట్టనున్నారు. 25, 26 తేదీల్లో పాఠశాలలు, పంచాయతీల్లో క్రీడా పోటీల ద్వారా స్వచ్ఛతపై ప్రచారం చేయనున్నారు. గణేష్ నిమజ్జనం అనంతరం ఘాట్లను శుభ్రం చేయడంతోపాటు పూల వ్యర్థాలతో కంపోస్ట్ తయారీకి చర్యలు తీసుకోనున్నారు. 27న పర్యాటక, చారిత్రక ప్రాంతాల్లో ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
సఫాయి మిత్రలకు ప్రత్యేక శిబిరాలు
ఈ నెల 30న ‘సఫాయిమిత్ర సురక్ష–సన్మాన’ కార్యక్రమం నిర్వహించనున్నారు. పారిశుద్ధ్య కార్మికులకు ఉచిత ఆరోగ్య పరీక్షలు, రక్షణ పరికరాల పంపిణీతోపాటు సన్మానం చేయనున్నారు. ప్రతి పీహెచ్‌సీ పరిధిలో ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని వైద్యాధికారులను ఆదేశించారు.
అక్టోబర్ 1న శ్రమదానం
అక్టోబర్ 1న ఉదయం 8 గంటలకు ‘ఒక రోజు–ఒక గంట–కలిసికట్టుగా’ కార్యక్రమంలో భాగంగా ప్రజాప్రతినిధులు, ప్రజల భాగస్వామ్యంతో భారీ శ్రమదానం నిర్వహించనున్నారు. 2న స్వచ్ఛ భారత్ దివాస్ సందర్భంగా గ్రామాల్లో ప్రత్యేక గ్రామసభలు, పట్టణాల్లో కౌన్సిల్ సమావేశాలు నిర్వహించనున్నారు. శుభ్రం చేసిన ప్రాంతాల్లో ‘ఏక్ పేడ్ మా కే నామ్’ కింద మొక్కలు నాటనున్నారు.
అధికారులకు బాధ్యతలు
ప్రతి గ్రామంలో లైన్ డిపార్ట్‌మెంట్లతో సమన్వయం చేసుకుని రోజువారీ కార్యక్రమాలు నిర్వహించాలని ఎంపీడీఓలను ఆదేశించారు. ప్రతిరోజూ 10 ఉత్తమ ఫొటోలను గ్రూపులో అప్‌లోడ్ చేయాలని సూచించారు. పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాల్లో మరుగుదొడ్లు, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని విద్యాశాఖ, మహిళా శిశు సంక్షేమ శాఖలకు సూచించారు. మిషన్ భగీరథ అధికారులు నీటి లీకేజీలను అరికట్టి, గ్రామాల్లోని ఓహెచ్‌ఎస్‌ఆర్, జీఎల్‌ఎస్‌ఆర్ ట్యాంకులను శుభ్రం చేయాలని కలెక్టర్ ఆదేశించారు.
ఫ అక్టోబర్ 2వ తేదీ వరకు
‘స్వచ్ఛతా హి సేవ–2026’
ఫ గ్రామాల్లో పారిశుద్ధ్య
కార్యక్రమాలు చేపట్టిన సిబ్బంది
ఫ విద్యార్థులు, అధికారులు,
ప్రజల భాగస్వామ్యం


