ఇక పర్యవేక్షణే కీలకం
ఫ సిబ్బంది సమయపాలన
పాటించేలా మొబైల్ యాప్
ఫ విధులకు డుమ్మా
కొట్టకుండా కార్యాచరణ
ఫ ఇక రిజిస్టర్‌లో సంతకాలు
పెట్టే పద్ధతికి స్వస్తి
ఫ ఆఫీస్‌లోనే రెండు పూటలా యాప్‌లో ఫొటో దిగాల్సిందే..
నల్లగొండ : ప్రభుత్వ ఉద్యోగుల హాజరు విషయంలో ఇక నుంచి నిబంధనలు మరింత కఠినం కానున్నాయి. విధులకు ఆలస్యంగా రావడం.. గైర్హాజరైనా హాజరైనట్లు రిజిస్టర్‌లో సంతకాలు చేయడం.. కొన్ని గంటలకే విధులు ముగించుకుని వెళ్లిపోవడం వంటి వాటికి చెక్ పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీమీ ప్రమాణంశ్రీ యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇకపై ఉద్యోగులు ఈ యాప్ ద్వారానే హాజరు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. జిల్లాలో యాప్ అమలును పక్కాగా చేపట్టాలని కలెక్టర్ అన్ని శాఖల అధికారులను ఆదేశించారు.
కలెక్టరేట్‌లో తొలిదశ
జిల్లా కలెక్టరేట్‌లో తొలిదశగా ‘మీ ప్రమాణం’ యాప్ ద్వారా హాజరు నమోదు ప్రక్రియను ప్రారంభించారు. ఈ నెల 10 నుంచి రెవెన్యూ విభాగానికి చెందిన సిబ్బంది యాప్ ద్వారానే హాజరు నమోదు చేసుకుంటున్నారు. సుమారు వంద మంది వరకు ఉద్యోగులు ప్రస్తుతం ఈ విధానాన్ని అనుసరిస్తున్నారు. త్వరలోనే ఇతర శాఖలకు కూడా దీనిని విస్తరించనున్నారు.
70 ప్రభుత్వ శాఖల్లో..
నల్లగొండ జిల్లాలో మొత్తం 70 ప్రభుత్వ శాఖలు ఉన్నాయి. ఇందులో 48 శాఖలు సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం (కలెక్టరేట్)లో కొనసాగుతున్నాయి. మిగిలిన శాఖల కార్యాలయాలు పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్నాయి. అయితే వివిధ ప్రాంతాల నుంచి ఉద్యోగులు జిల్లా కేంద్రానికి సమయానికి రాకుండా ఆలస్యంగా వస్తున్నారు. ఇప్పటివరకు ఉద్యోగుల హాజరు రిజిస్టర్‌లో సంతకాలు చేసి విధులకు హాజరైనట్లు నమోదు చేసుకునేవారు. ఈ విధానంలో సమయపాలనపై పర్యవేక్షణ అంతంతమాత్రంగానే ఉండడంతో కొత్త యాప్‌ను తీసుకొచ్చారు.
ఆధార్, జీపీఎస్‌తో అనుసంధానం
రెగ్యులర్, కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల వివరాలను యాప్‌లో నమోదు చేస్తున్నారు. ఉద్యోగి ఎంప్లాయ్ ఐడీ, ఈ–మెయిల్, ఆధార్ నంబర్‌తోపాటు కార్యాలయ జీపీఎస్ లొకేషన్ వివరాలను అనుసంధానం చేస్తున్నారు. ప్రతి శాఖ అధిపతికి ప్రత్యేక లాగిన్ అందించనున్నారు. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత సంబంధిత శాఖల్లో యాప్ ద్వారా హాజరు నమోదు ప్రారంభమవుతుంది
కళ్లను బ్లింక్ చేస్తేనే..
ఉద్యోగులు తమ మొబైల్‌లో యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని కార్యాలయానికి వచ్చిన తర్వాత లాగిన్ కావాలి. అనంతరం యాప్‌లో నిర్దేశించిన విధంగా ముఖ గుర్తింపు ప్రక్రియలో భాగంగా కళ్లను మూసి తెరవడం (బ్లింక్) చేయాలి. అప్పుడే హాజరు నమోదవుతుంది. ఉదయం, సాయంత్రం రెండు పూటలా హాజరు నమోదు చేయడం తప్పనిసరి కానుంది. కార్యాలయ లొకేషన్ ఆధారంగా హాజరు నమోదయ్యేలా వ్యవస్థను రూపొందించారు.
‘మీ ప్రమాణం’ యాప్ ద్వారా హాజరు నమోదు ప్రక్రియను కచ్చితంగా అమలు చేయాలని కలెక్టర్ చంద్రశేఖర్ శాఖ అధిపతులను ఆదేశించారు. ఉద్యోగులకు యాప్ పనితీరుపై అవగాహన కల్పించాలని, హాజరు నమోదును ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు. ఇప్పటికే కలెక్టరేట్‌లో రెవెన్యూ సిబ్బందికి అమలు చేస్తున్నారు. త్వరలోనే మిగిలిన శాఖలన్నింటిలో అమలు అయ్యేలా అధికారులు చర్యలు ప్రారంభించారు.


