డిజిటల్ క్రాఫ్ బుకింగ్ సర్వేకు రైతులు సహకరించాలి. సర్వేయర్లు గ్రామానికి వచ్చిన వెంటనే వారిని పంట పొలాల వద్దకు తీసుకుపోయి వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయించుకోవాలి. లేకపోతే ప్రభుత్వం సన్నాలకు ప్రకటించిన బోనస్ వర్తించదు. పంటల నమోదుకు ఈ నెలాఖరు వరకు మాత్రమే అవకాశం ఉంది.
– ఉల్లోజు వినోద్‌కుమార్, డీఏఓ
ఫ జిల్లావ్యాప్తంగా 11.40 లక్షల
ఎకరాల్లో పంటల సాగు
ఫ ఇప్పటి వరకు 5.50 లక్షల
ఎకరాల్లో సర్వే పూర్తి
ఫ 540 మంది ప్రైవేట్
సర్వేయర్లతో నిర్వహణ
నల్లగొండ టౌన్ : వానాకాలం పంటల నమోదు సర్వే ముమ్మరంగా సాగుతోంది. ఏఏ పంటలు ఎన్ని ఎకరాల్లో సాగు చేశారో.. సర్వే నంబర్ల వారీగా వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేస్తున్నారు. పంట కొనుగోళ్లతో పాటు రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసిన సన్నాలకు క్వింటాకు రూ.500 బోనస్‌ను అందించేందుకు గాను డిజిటల్ సర్వేను క్షేత్రస్థాయిలో చేపట్టింది. దీనికి గాను జిల్లాలోని 540 రెవెన్యూ గ్రామాల వారీగా ప్రైవేట్ సర్వేయర్లను జిల్లా వ్యవసాయశాఖ నియమించింది. ప్రతి సర్వేయర్‌కు 4,500 సర్వే నంబర్లను కేటాయించింది. గత నెల 25న ప్రారంభించిన ఈ సర్వేను ఈ నెలాఖరు వరకు పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.
రైతుల ఇబ్బందులు తొలగించేందుకే..
ఈ వానాకాలం సీజన్‌లో జిల్లా వ్యాప్తంగా 11.40 లక్షల ఎకరాలలో వరి, పత్తి, కంది, వేరుశనగ, పెసర తదితర సంటలను రైతులు సాగు చేశారు. రైతులు డిజిటల్ క్రాప్ సర్వేలో పంటలను నమోదు చేయించుకోకపోతే వారు పండించిన పంటలను అమ్ముకోవడానికి ఇబ్బందులు పడాల్సి వస్తుంది. వారి ఇబ్బందులను తొలగించేందుకే పంటల నమోదు ప్రక్రియను చేపట్టారు. దీంట్లో భాగంగా డిజిటల్ సర్వే చేసే సర్వేయర్ల వద్ద ఉన్న ఫోన్లకు వ్యవసాయ శాఖ లాగిన్ ఇచ్చింది. ఒక్కో రైతుకు సంబంధించిన డిజిటల్ సర్వే నమోదు చేస్తే సర్వేయర్‌కు రూ.7 చొప్పున ప్రభుత్వం చెల్లించనుంది. ఆయా సర్వేయర్లు వారికి కేటాయించిన గ్రామాలకు వెళ్లి ఆ గ్రామ రైతుల పంట చేలలో ఉండి డిజిటల్ క్రాప్ బుకింగ్ యాప్‌లో వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది. 20 మీటర్లలోపు ఉంటేనే బుకింక్ చేసే అవకాశం ఉంటుంది. అంతకు దూరంగా ఉండి నమోదు చేస్తే ఆన్‌లైన్‌లో నమోదు కాదు. దీంతో సర్వేయర్లు విధిగా క్షేత్రస్థాయిలోనే రైతుల పంట పొలాల్లోనే వివరాలు నమోదు చేస్తున్నారు. ఇప్పటి వరకు లక్షలాది సర్వే నంబర్లలో సాగు చేసిన మొత్తం 5.50 లక్షల ఎకరాల పంటల సర్వే పూర్తయింది. ఈ నెలాఖరు వరకు సర్వే పూర్తి చేసేందుకు యంత్రాంగం ముందుకు సాగుతోంది.


