నీటిని మళ్లించకుండా..
గుర్రంపోడు : పానగల్ ఉదయ సముద్రంలో మరో ఆరు రోజులకు సరిపడా నీరు మాత్రమే ఉన్న నేపథ్యంలో తాగునీటి అవసరాలను తీర్చేందుకు ఏఎమ్మార్పీ నుంచి నీటిని తరలిస్తున్నారు. నల్లగొండ కార్పొరేషన్, మూడు మున్సిపాలిటీలు, 578 ఆవాస ప్రాంతాల్లో తీవ్ర త్రాగునీటి పరిస్ధితలు ఎదురయ్యే ప్రమాదం ఉన్నందున ఉదయ సముద్రం నీటి నిలువ సామర్థ్యం 1.5 టీఎంసీలు కాగా 1.1 టీఎంసీ వరకు నీటిని నింపేందుకు పది రోజుల పాటు నీటి విడుదల చేస్తున్నారు. ప్రధాన కాల్వ వెంట అన్ని తూములను మూసివేసి నీటి పారుదల శాఖ, పోలీసు, రెవెన్యూ, మిషన్ భగీరథ అధికారులు నిఘా పెట్టి సమన్వయంతో నీటిని తరలిస్తున్నారు.
కేవలం తాగునీటి అవసరాలకే..
నాగార్జునసాగర్ ప్రాజెక్టులో 510 అడుగుట నీటిమట్టం వరకు ఏఎమ్మార్పీకి నీటిని లిఫ్ట్ చేసే వీలుంది. అంతకంటే దిగువకు నీటిమట్టం తగ్గితే హైదరాబాద్‌కు మాత్రమే నీటిని తీసుకునేందుకు అనుమతి ఉంది. ఈ పరిస్థితుల్లో సాగర్ ప్రస్తుత నీటిమట్టం 513.8 అడుగులు ఉండడంతో మూడు అడుగులకు పైగా నీటిని వినియోగించుకునే అవకాశం ఉంది. నీటిమట్టం తగ్గకముందే తాగు అవసరాలకు సరిపడా నీటిని నిల్వ చేసుకోవాల్సి ఉంది.
కాల్వలో వేగంగా నీటి ప్రవాహం
ఏఎమ్మార్పీ లైనింగ్ పనుల్లో భాగంగా ప్రధానకాల్వకు ఇరువైపులా కంపచెట్టు తొలగించడం, అడ్డుకట్టలు తొలగించి సమతలంగా మట్టి బెడ్డింగ్ పనులు పూర్తి చేయడంతో కాల్వలో నీటి ప్రవాహ వేగం పెరిగింది. గతంలో ఏకేబీఆర్ నుంచి నీటి విడుదల జరిగిన 24 గంటల తర్వాత గుర్రంపోడు డివిజన్‌కు నీరు చేరితే, ఇప్పుడు 12 గంటల్లోనే నీరు గుర్రంపోడు డివిజన్ పరిధిలోకి చేరింది. లైనింగ్ పూర్తయితే రెట్టింపు వేగంగా నీటి ప్రవాహం ఉంటుందని అధికారులు అంటున్నారు.
ఫ ఏఎమ్మార్పీ కాల్వ వెంట నాలుగు శాఖల సిబ్బంది పర్యవేక్షణ
ఫ తూమల వద్ద రాత్రింబవళ్లు కాపలా
ఏఎమ్మార్పీ పరిధిలో ప్రస్తుతం వరి సాగు నారు దశలోనే ఉంది. నాట్లు వేసేందుకు కొంత సమయం ఉన్నా వర్షాభావంతో నారు వాడు పట్టి దెబ్బతినేలా ఉంది. మరోవైపు ఎండిపోతున్న పత్తి పంటను కాపాడుకునేందుకు రైతులు ప్రధాన కాల్వకు ఇరువైపులా మోటార్లు వేసుకునే ప్రయత్నాలను అధికారులు అడ్డుకుంటున్నారు. పానగల్ చెరువు కట్ట చుట్టూ వందలాది మోటార్లు ఉన్నందున వాటిని వినియోగంచకుండా రైతులతో సున్నితంగా మాట్లాడి, సమస్యను వివరించి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు.


