నకిరేకల్ : మూసీ మత్స్య పారిశ్రామిక మార్కెటింగ్ సహకార సంఘం చైర్మన్‌తో పాటు ఇతర పదవులకు ఈనెల 8న ఎన్నిక నిర్వహించనున్నట్లు ఎన్నికల అధికారి కె.శ్రీరాం ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు నామినేషన్ల స్వీకరణ, 11 గంటల నుంచి 11.30 గంటల వరకు నామినేషన్ల పరిశీలన, ఉపసంహరణ ఉంటుందని పేర్కొన్నారు. అవసరమైతే అదేరోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ నిర్వహించి ఓట్ల లెక్కింపు జరిపి ఫలితాలను ప్రకటించనున్నట్లు ఎన్నికల అధికారి తెలిపారు.
అధికారులే కూలీలుగా..
చందంపేట : సన్న, చిన్నకారు రైతులకు ఉచితంగా అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సరఫరా చేసిన పత్తి విత్తనాల ప్యాకెట్లు ఆదివారం చందంపేట మండల కేంద్రంలోని రైతు వేదికకు చేరాయి. వీటిని మండలంలోని పోలేపల్లి రైతు వేదికకు తరలించాల్సి ఉండగా ఎవరూ లేకపోవడంతో మండల వ్యవసాయ అధికారి లక్‌పతి, ఏఈఓలు ప్రవీణ్, సర్దార్ స్వయంగా వాహనంలోకి ఎక్కించి తరలించారు. ఇక్కడ వ్యవసాయ అధికారులే కూలీలుగా అవతారం ఎత్తడం గమనార్హం.
రేణుక ఎల్లమ్మకు
ప్రత్యేక పూజలు
కనగల్ : మండలంలోని దర్వేశిపురం రేణుక ఎల్లమ్మ ఆలయంలో ఆదివారం అమ్మవారికి అర్చకుడు నాగోజు మల్లాచారి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారి ప్రత్యేకంగా అలంకరించి కుంకుమ పూజ, అభిషేకం జరిపారు. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి ఆలయ వద్ద ఉన్న పుట్టలో పాలు పోసి నాగ పడగలకు మొక్కులు చెల్లించుకున్నారు. తమ కోరికలు నెరవేరాలని వేప, రావి కొమ్మలతో ముడుపులు కట్టారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ చీదేటి వెంకట్‌రెడ్డి, నాగేశ్వర్‌రావు, ఉపేందర్‌రెడ్డి పాల్గొన్నారు.
విద్యార్థులు ఉన్నత శిఖరాలకు చేరుకోవాలి
సంస్థాన్ నారాయణపురం : విద్యార్థులు అవకాశాలను సద్వినియోగం చేసుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని తెలంగాణ గురుకులాల కార్యదర్శి డాక్టర్ ఉషారాణి పిలుపునిచ్చారు. యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలోని తెలంగాణ గురుకుల పాఠశాల (సర్వేల్)లో 1976, 1980 ఎస్‌ఎస్‌సీ బ్యాచ్‌ల విద్యార్థులు రూ.8.5 లక్షల వ్యయంతో నిర్మించిన వాలీబాల్, బాస్కెట్‌బాల్ కోర్టులను ఆమె ప్రారంభించారు. అలాగే గత విద్యా సంవత్సరంలో పదో తరగతిలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు 1985 ఎస్‌ఎస్‌సీ బ్యాచ్ విద్యార్థుల తరఫున రూ.70 వేల విలువైన మూడు ట్యాబ్‌లను బహూకరించి మాట్లాడారు. తాము చదువుకున్న పాఠశాల అభివృద్ధికి పూర్వ విద్యార్థులు చేయూతనివ్వడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాస్‌రెడ్డి, 1976 బ్యాచ్‌కు చెందిన పద్మారెడ్డి, సురేందర్‌రెడ్డి, జితేందర్‌రెడ్డి, 1980 బ్యాచ్‌కు చెందిన రాజశేఖర్‌రెడ్డి, కరుణాసాగర్, 1985 బ్యాచ్‌కు చెందిన పురుషోత్తంరెడ్డి, పీడీ అరుణ తదితరులు పాల్గొన్నారు.


