నల్లగొండ : మీ–సేవ కేంద్రాల్లో ప్రభుత్వం నిర్ణయించిన యూజర్ చార్జీలకే సేవలు అందించాలని, ప్రజల నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ అధిక చార్జీలు వసూలు చేయవద్దని కలెక్టర్ చంద్రశేఖర్ ఆదేశించారు. నిబంధనలకు విరుద్ధంగా అధిక రుసుములు వసూలు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లాలోని మీసేవ కేంద్రాల యజమానులు, ఆపరేటర్లతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. ప్రభుత్వం ఇటీవల సవరించిన యూజర్ చార్జీలు వెంటనే అమల్లోకి వచ్చాయని, కొన్ని ప్రాంతాల్లో నిర్ణయించిన రేట్ల కంటే అధికంగా వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదులు అందుతున్నాయని.. ఇకపై ఫిర్యాదులు వస్తే ఉపేక్షించమని హెచ్చరించారు. కేంద్రాలు నిర్ణీత పనివేళలను తప్పనిసరిగా పాటించాలని, ఏదైనా కారణంతో కేంద్రం ఎక్కువ సమయం పనిచేయాల్సి వస్తే సంబంధిత తహసీల్దార్‌కు ముందస్తుగా సమాచారం అందిచాలన్నారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి దశరథ, మీసేవ జిల్లా అధికారి రాజశేఖర్, ఈడీఎం దుర్గారావు, ఏపీడీ శ్రవణ్ కుమార్, రవి పాల్గొన్నారు.
నల్లగొండ, సాక్షి ప్రతినిధి : ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో (ఎస్‌ఐఆర్–సర్) ఓటర్లు నానా తంటాలు పడున్నారు. 2002 నాటి ఓటరు గుర్తింపు కోసం క్షేత్రస్థాయిలో ఇబ్బందులు తప్పడం లేదు. అనేక కాలనీల్లో పంపిణీ చేసిన ఓటరు ఫారాలను ఎలా నింపాలో, ఏ వివరాలు ఎక్కడ రాయాలో అర్థం కావడం లేదంటూ ప్రజలు సిబ్బందిని అడుగుతున్నారు. మరికొన్ని ప్రాంతాల్లో దశాబ్దాల కిందట, ఎప్పుడో మరణించిన తమ తల్లిదండ్రుల పాత ఎన్నికల గుర్తింపు కార్డులను ఇప్పుడు ఎలా తీసుకురావాలంటూ ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా పెద్దగా చదుకోని వారు పాత వివరాలను ఎలా తెలుసుకోవాలంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 24 ఏళ్ల కిందటి ఓటరు గుర్తింపు కార్డు నంబరు, ఓటరు సీరియల్ నంబర్, పోలింగ్ స్టేషన్ తదితర వివరాలు తెలియక అయోమయానికి గురవుతున్నారు.
99 శాతం పంపిణీ పూర్తి
జిల్లాలో ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ చివరి దశకు చేరుకుంది. జిల్లా వ్యాప్తంగా మొత్తం 15,16,253 మంది ఓటర్లు ఉండగా, 15,00,788 మందికి ఎన్యుమరేషన్ ఫారాలు పంపిణీ చేయడంతో 98.98 శాతం లక్ష్యాన్ని జిల్లా సాధించింది. కేవలం 15,465 మంది ఓటర్లకు మాత్రమే ఫారాలు అందించాల్సి ఉండగా, ఈ ప్రక్రియలో రాష్ట్రంలోనే నల్లగొండ జిల్లా తొలి స్థానంలో నిలిచినట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు.
తిరిగి ఇవ్వడంలో జాప్యం
క్షేత్రస్థాయిలో కొన్నిచోట్ల బీఎల్‌ఓల పనితీరుపై ఓటర్ల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఇంటింటికి వెళ్లి ఫారాలు అందజేయాల్సిన బీఎల్‌ఓలు.. కొందరు ఓటర్లకు ఫోన్ చేసి తమ వద్దకే వచ్చి ఫారాలు తీసుకెళ్లాలని సూచిస్తున్నట్లు సమాచారం. ఫారాలు పూర్తిగా నింపిన అనంతరం తిరిగి తీసుకొచ్చి ఇవ్వాలని కూడా చెబుతున్నారని పలువురు ఓటర్లు వాపోతున్నారు. ముఖ్యంగా పట్టణాల్లో అంగన్‌వాడీ కేంద్రాలు, వార్డు ఆఫీస్‌లకు వచ్చి ఇవ్వాలని చెబుతున్నట్లు ఓటర్లు పేర్కొంటున్నారు. ఇక ఇప్పటివరకు పంపిణీ చేసిన ఎన్యుమరేషన్ ఫారాల్లో 1,39,847 ఫారాలను మాత్రమే (9.22 శాతం) డిజిటలైజ్ చేశారు. ఎప్పటికప్పడు ఫారాలు తీసుకున్న ఓటర్లు తిరిగి ఇచ్చే విషయంలో జాప్యం జరుగుతోంది.
ఎదురవుతున్న సమస్యలెన్నో..
2002 ఓటరు జాబితాలో పేర్లు, ఇంటి పేర్లలో అక్షర దోషాలు ఉండటంతో మ్యాపింగ్ ప్రక్రియలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. 2002 తర్వాత ఓటరుగా నమోదైన పలువురు అవసరమైన ధ్రువీకరణ పత్రాలు సమర్పించడంలో ఆలస్యం చేస్తున్నారు. వలస వెళ్లిన ఓటర్లను ఫోన్‌లో సంప్రదించినా స్పందన లేకపోవడంతో ఫారాల పంపిణీ, సేకరణ జాప్యం అవుతోంది. అద్దె ఇళ్లు ఖాళీ చేసి వేరే ప్రాంతాలకు మారిన వారి కొత్త చిరునామాలు గుర్తించడం కష్టంగా మారింది. ఒకే వ్యక్తికి రెండు లేదా అంతకంటే ఎక్కువ చోట్ల ఓట్లు నమోదై ఉండటంతో ఏ ఓటును కొనసాగించాలనే విషయంలో ఓటర్లు నిర్ణయం తీసుకోవడంలో ఆలస్యం చేస్తున్నారు. కొంతమంది ఓటర్లు ఎన్యుమరేషన్ ఫారాలు నింపడంపై ఆసక్తి చూపకపోవడంతో బీఎల్‌ఓలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అయితే ఈనెల 30వ తేదీ నాటికి ఫారాల సేకరణ పూర్తి చేసి డిజిటలైజ్ చేయాల్సి ఉంది. జూలై 31వ తేదీన ముసాయిదా ఓటరు జాబితా విడుదల చేయనున్నారు. ఈలోగా ఫారాలను పూర్తి చేయించడం, వాటిని డిజటలైజ్ చేయడం సవాల్‌గా మారింది.
నల్లగొండ : ప్రభుత్వ పాఠశాలల్లో చదివే ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య అందించి, ప్రపంచ స్థాయిలో పోటీపడే సామర్థ్యాన్ని కల్పించాలని కలెక్టర్ బి.చంద్రశేఖర్ విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ ఉదయాదిత్య భవన్‌లో నిర్వహించిన విద్యాశాఖ సమీక్షలో ఆయన మాట్లాడారు. జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల చేరికలను గణనీయంగా పెంచాలని, ఇప్పటికే ఉన్న విద్యార్థులు ఇతర పాఠశాలలకు వెళ్లకుండా చూడాలని ఆదేశించారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో ఐదేళ్లు పూర్తిచేసుకున్న చిన్నారులను సమీప ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని సూచించారు. ఎఫ్‌ఆర్‌ఎస్ నమోదు అనంతరం విద్యార్థులు పాఠశాల వెలుపలికి పంపకుండా చూడాల్సిన బాధ్యత ఉపాధ్యాయులదే అన్నారు. ప్రతి ప్రాథమిక పాఠశాలలో కనీసం 25 మంది విద్యార్థులు ఉండేలా చూడాలని, ప్రీ–ప్రైమరీ పాఠశాలల్లో చేరికలు పెంచేందుకు సామాజిక మాధ్యమాల ద్వారా ప్రచారం చేసి.. తల్లిదండ్రుల్లో విశ్వాసం పెంచాలన్నారు. మూడు నెలలకోకసారి ఆరోగ్య పరీక్షలు నిర్వహించి వివరాలను యాప్‌లో నమోదు చేయాలన్నారు. తెలుగు, హిందీ, ఇంగ్లిష్ భాషల్లో విద్యార్థులు సమర్థంగా చదవడం, రాయడం, మాట్లాడడం నేర్చుకునేలా కృషి చేయాలన్నారు. సమావేశంలో జెడ్పీ సీఈఓ ప్రేమ్‌కరణ్‌రెడ్డి, డీఈఓ సుశీందర్‌రావు తదితరులు పాల్గొన్నారు.
ఫ ప్రభుత్వం నిర్ణయించిన చార్జీలకే సేవలు అందించాలి
ఫ కలెక్టర్ చంద్రశేఖర్
ఫ ఎన్యుమరేషన్ ఫారాలు నింపడంలో గందరగోళం
ఫ 2002 నాటి వివరాలు దొరక్క ఓటర్ల ఆందోళన
ఫ జిల్లాలో 98.98 శాతం ఫారాల పంపిణీ పూర్తి
ఫ రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నల్లగొండ
నియోజకవర్గాల వారీగా ఫారాల పంపిణీ
నియోజకవర్గం మొత్తం ఓటర్లు ఫారాల పంపిణీ శాతం
దేవరకొండ 2,69,098 2,67,172 99.28
నాగార్జునసాగర్ 2,34,722 2,33,505 99.48
మిర్యాలగూడ 2,40,574 2,36,351 98.24
నల్లగొండ 2,49,571 2,43,276 97.48
మునుగోడు 2,63,757 2,63,533 99.92
నకిరేకల్ 2,58,531 2,56,951 99.39


