పత్తి విత్తనాలకు రైతుల బారులు
గుర్రంపోడు : జాతీయ పత్తి ఉత్పాదకత పథకం కింద రైతులకు ఉచితంగా అందిస్తున్న పత్తి విత్తనాల కోసం శుక్రవారం గుర్రంపోడు రైతు వేదిక వద్ద రైతులు బారులుదీరారు. భారీ సంఖ్యలో రైతులు చేరుకోవడంతో పోలీసుల బందోబస్తు నడుమ విత్తనాలను పంపిణీ చేశారు. ఒక్కో రైతుకు గరిష్టంగా 2.5 ఎకరాలకు సరిపడా పత్తి విత్తన ప్యాకెట్లను అందజేశారు. ఉచితంగా పొందిన పత్తి విత్తనాలను సద్వినియోగం చేసుకుంటామని, దుర్వినియోగం చేస్తే చట్టపరమైన చర్యలకు బాధ్యత వహిస్తామని రైతుల నుంచి డిక్లరేషన్ తీసుకున్నారు. విత్తనాలు పొందిన రైతుల పత్తి పంటను జియోట్యాగింగ్ చేసి విస్తరణాధికారులు పర్యవేక్షిస్తారని ఏఓ కంచర్ల మాధవరెడ్డి తెలిపారు. పంట ఎదిగేందుకు ఉచితంగా గ్రోత్ ప్రమోటర్లను కూడా అందిస్తామన్నారు.
నల్లగొండ అగ్రికల్చర్ : రాష్ట్రంలో పత్తి ఉత్పత్తులను పెంపొందించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం పత్తి రైతులకు ప్రోత్సాహం అందించనుంది. పత్తి ఉత్పాదక మిషన్ ద్వారా పత్తి సాగును పెంచాలని నిర్ణయించింది. ఈ వానాకాలం సీజన్ నుంచి రాష్ట్రంలో 18 జిల్లాలో ఈ పథకాన్ని అమలు చేయనుంది. అందులో నల్లగొండ జిల్లాలో కూడా పత్తి ఉత్పాదక మిషన్ పథకాన్ని అమలు చేయనున్నారు. ఈ పథకం కింది ఒక్కో రైతుకు ఎకరం నుంచి రెండున్నర ఎకరాల వరకు సబ్సిడీ అందించనుంది. ఈ మిషన్ ద్వారా అధిక సాంద్రత, తక్కువ దూరంలో విత్తనాలను విత్తడం, సమగ్ర పంట యాజమాన్యం, సమగ్ర పోషకాల యాజమాన్యం, అంతర పంటల పద్ధతి వంటి ఐదు పద్ధతుల్లో పత్తిని సాగు చేయించడంతో పాటు సబ్సిడీతో పాటు ఇన్‌ఫుట్‌లను కూడా రైతులకు అందించనున్నారు. ఇప్పటికే ఈ పథకానికి అవసరమైన పత్తి విత్తనాలను కేంద్రం జిల్లా వ్యవసాయ శాఖకు పంపింది
పత్తి సాగులో పాటించే ఐదు పద్ధతులు ఇవే..
● అధిక సాంద్రత పద్ధతిన (హైడెన్సిటీ ప్లాంటింగ్ సిస్టమ్) జిల్లాలో 20,600 ఎకరాల్లో సాగు చేయించనున్నారు. ఈ విధానానికి వర్షాధార పరిస్థితులు, లోతు తక్కువ నల్లరేగడి, ఎర్రనేలలు అనుకూలంగా ఉంటాయి. ఈ పద్ధతిలో 90´15 సెంటీమీటర్ల దూరంలో, ఎకరానికి 29,629 మెక్కలను నాటాల్సి ఉంటుంది. ఎకరానికి 6 ప్యాకెట్లు విత్తనాలను(ఒక్కో ప్యాకెట్ 450 గ్రాములు) ఇతర ఇన్‌ఫుట్ కింద ప్రభుత్వం రూ.7200 సబ్సిడీపై రైతులకు కేంద్రం ఇవ్వనుంది.
● తక్కువ దూరం పాటించడం (క్లోసర్ స్పెసింగ్) ఈ పద్ధతిలో సాగు చేయడానికి మధ్యస్థ సారవంతమైన నల్లరేగడి భూములు అనుకూలం. 90´30 సెంటీమీటర్ల దూరంలో విత్తనాలు విత్తుకోవాలి. ఎకరానికి 14,814 మొక్కల చొప్పున ఉండేలా చూసుకోవాలి. ఇందుకు ఎకరానికి నాలుగు ప్యాకెట్ల విత్తనాలు అవసరం ఉంటుంది. జిల్లాలో ఈ పద్ధతిన 9 వేల ఎకరాల్లో సాగు చేయించాలని నిర్ణయించారు. విత్తనాలతో పాటు ఇతర ఇన్‌ఫుట్ కింద ఎకరానికి రూ.5,400ల వరకు ప్రభుత్వం రైతులకు సబ్సిడీపై అందించనుంది.
● పత్తిలో సమగ్ర పంట యాజమాన్యం పద్ధతిలో జిల్లాలో 1400 ఎకరాలలో సాగు చేయించాలని నిర్ణయించింది. 90´60 సెంటీమీటర్ల దూరంలో ఎకరానికి 7 వేల మొక్కలు ఉంటేలా విత్తనాలు విత్తుకోవాలి.
● సమగ్ర పోషకాల యాజమాన్యం పద్ధతిలో 725 ఎకరాల్లో సాగు చేయించనున్నారు.
● అంతర పంటలు పద్ధతిలో 350 ఎకరాల్లో పత్తిని సాగు చేయించాలని నిర్ణయించింది. వీటికి ఎకరానికి రూ.2800 చొప్పున విత్తనాలతో పాటు ఇతర ఇన్‌ఫుట్ కింద పలు సబ్సిడీలను కేంద్ర ప్రభుత్వం రైతులకు అందించనుంది.
పత్తిసాగు పెంచేందుకు రైతులకు ప్రోత్సాహం అందిస్తున్న కేంద్రం
ఫ రైతులకు విత్తనాలు, ఇన్‌ఫుట్ సబ్సిడీలు
ఫ ఐదు పద్ధతుల్లో సాగు చేయించేలా ప్రణాళిక


