రామగిరి(నల్లగొండ): జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలు జిల్లా గ్రంథాలయ సంస్థకు సెస్ చెల్లించి, గ్రంథాయాల అభివృద్ధికి సహకరించాలని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ హఫీజ్ ఖాన్ అన్నారు. గురువారం స్థానిక గ్రంథాలయ సంస్థలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఆధ్వర్యంలో సర్వసభ్య సమావేశం నిర్వహించారు. గత సర్వసభ్య సమావేశంలో తీసుకున్న నిర్ణయాల అమలుపై సమీక్షించారు. జిల్లా గ్రంథాలయ సంస్థలో ఖాళీల భర్తీకి చర్యలు చేపట్టాలని తీర్మానించారు. జిల్లా కేంద్ర గ్రంథాలయంలో సిబ్బంది కొరతను దృష్టిలో ఉంచుకుని, కలెక్టర్ గెజిట్ ప్రకారం సిబ్బంది ఆరుగురు గ్రంథపాలకులు, ఇద్దరు లైబ్రరీ హెల్పర్ల నియామకానికి పౌర గ్రంథాలయ శాఖ సంచాలకులకు ప్రతిపాదనలు పంపేందుకు ఆమోదం తెలిపారు. మొత్తం ఐదు ఎజెండా అంశాలపై కమిటీ సభ్యులతో చర్చించి తీర్మానాలు చేశారు. సమావేశంలో గ్రంథాలయ సంస్థ కార్యదర్శి బాలమ్మ, విద్యాశాఖ సీఎంఓ కత్తుల రవీందర్, వయోజన విద్య అధికారి దుర్గాప్రసాదరావు, ఏపీఆర్‌ఓ బీమేష్, డీపీఓ అధికారి వెంకటేశ్వర్లు, లైబ్రరీ ఇన్‌చార్జ్ రాజేష్ పాల్గొన్నారు.


