ఫ సన్నాల సాగుపై
ఆసక్తి చూపుతున్న రైతులు
ఫ ఇదే అదునుగా విత్తనాల ధరను
పెంచిన వ్యాపారులు
నల్లగొండ అగ్రికల్చర్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సన్న రకాల ధాన్యాన్నే సేకరించడంతోపాటు, పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాలు, మధ్యాహ్న భోజన పథకం, రేషన్ ద్వారా సన్న బియ్యాన్నే అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. దీనికి తోడు ఈ వానాకాలం నుంచి ఏడు రకాల సన్న ధాన్యం రకాలు అయిన బీపీటీ–5204 ( సాంబ మసూరి), డబ్ల్యూజీఎల్– 44 (సిద్ధి), ఆర్‌ఎన్‌ఆర్–15048 (తెలంగాణ సోనా), కేఎన్‌ఎం–1638 ( కూనారం వరి–2), జై శ్రీరామ్, హెచ్‌ఎంటీ సోనా, కేఎన్‌ఎం–7715 రకాలకే మద్దతు ధరతో పాటు ప్రత్యేక బోనస్ ప్రకటించడంతో రైతులు దొడ్డు రకాలను వదిలి వీటి సాగువైపు మొగ్గు చూపుతున్నారు.
వర్షాభావ పరిస్థితులపై ఆందోళన
వానాకాలం యాసంగి సీజన్‌లకు అనువైన తెలంగాణ సోనా, కూనారం వరి 2 రకాలపై రైతులు ఆసక్తి చూపుతున్నారు. తెలంగాణ సోనా 125 రోజులు, కూనారం వరి –2 120 నుంచి 125 రోజులు పంట కాలం కావడం, దిగుబడి ఎకరాకు 25 నుంచి 30 క్వింటాళ్ల చొప్పున రావడంతో వీటిపై మొగ్గు చూపుతున్నారు. ఇక.. జైశ్రీరాం, కేఎన్‌ఎం 7715, హెచ్‌ఎంటీ సోనా రకాలకు 135 రోజులు పంట కాలం ఉంటుంది. దిగుబడి కూడా 25 నుంచి 28 క్వింటాళ్లు ఎకరానికి వచ్చే అవకాశం ఉన్నందున రెండో ప్రాధాన్యత ఉన్న వీటిని సాగు చేసే ఆలోచనలో రైతులు ఉన్నారు. మిగతా రకాలు కూడా వానాకాలం సాగుకు అనుకూలమైనా సాంబమసూరి 145 నుంచి 150 రోజులు,హెచ్‌ఎంటీ సోనా 135 రోజులు, డబ్ల్యూజీఎల్ –44 వరి 140 నుంచి 150 రోజులు పంట కాలం కావడంతో వర్షాభావ పరిస్థితులు నెలకొంటాయని ప్రచారం జరుగుతుండటంతో ఇంకా రైతులు నార్లు కూడా పోయలేని పరిస్థితిలో ఉన్నారు. ఈ సీజన్‌లో జిల్లా వ్యాప్తంగా 5 లక్షల 40 వేల ఎకరాల్లో వరి సాగు చేసే అవకాశం ఉండడంతో వ్యవసాయ శాఖ సన్న రకాల విత్తనాలను అందుబాటులో ఉంచేందుకు వ్యవసాయ శాఖ చర్యలు చేపట్టింది.
ఎక్కువ ధరకు విక్రయం
రైతుల డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని విత్తన వ్యాపారులు ఆయా రకాల సన్న విత్తనాల ధరను ఏకంగా పెంచారు. ఎంఆర్‌పీ ధర కంటే అదనంగా రూ. 300 వరకు అధికంగా అమ్ముతున్నట్లు తెలిసింది. వ్యవసాయ శాఖ అధికారులు విత్తన వ్యాపారుల దోపిడి అరికట్టకపోగా వారికే వత్తాసు పలుకుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.


