ఎరువుల వాడకంపై రైతులకు అవగాహన | - | Sakshi
Sakshi News home page

ఎరువుల వాడకంపై రైతులకు అవగాహన

Jul 3 2026 1:46 AM | Updated on Jul 3 2026 1:46 AM

కొండమల్లేపల్లి: పట్టణ కేంద్రంలోని పశువుల సంత సమీపంలో గల రైతువేదికను గురువారం జిల్లా వ్యవసాయాధికారి వినోద్‌ కుమార్‌ పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులకు కాటన్‌ మిషన్‌, కపాస్‌ క్రాంతి పథకం, పంటమార్పిడి, ఎరువుల మోతాదు వాడకం తదితర అంశాలపై అవగాహన కల్పించారు. కపాస్‌ క్రాంతి కార్యక్రమం కింద రైతులకు పత్తి విత్తనాలను పంపిణీ చేశారు. అనంతరం మండల పరిధిలోని పెండ్లిపాకల గ్రామం వద్ద ఉన్న రైతువేదికను సందర్శించి యూరియా పంపిణీ విధానాన్ని పర్యవేక్షించారు. ఆయన వెంట మండల వ్యవసాయాధికారి జానకిరాములు, ఏఈఓలు మల్లేష్‌, మాధురి, తులసి, స్థానిక రైతులు తదితరులున్నారు.

బస్సు సౌకర్యం కల్పించాలి

మర్రిగూడ : మండలంలోని రాంరెడ్డిపల్లి గ్రామ పరిధిలో గల తానేదారుపల్లికి చెందిన విద్యార్థులు తమకు బస్సు సౌకర్యం కల్పించాలని డిమాండ్‌ చేస్తూ గురువారం రాంరెడ్డిపల్లిలో చండూరు–మాల్‌ ప్రధాన రహదారిపై ధర్నా చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ.. తమ గ్రామం ప్రధాన రహదారికి సుమారు 3 కిలోమీటర్ల దూరంలో ఉందని, దీంతో ప్రతిరోజు పాఠశాలలు, కళాశాలలకు వెళ్లేందుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధాన రోడ్డు వరకు నడుచుకుంటూ వెళ్లడం వల్ల సమయం వృథా కావడమే కాకుండా సకాలంలో విద్యాలయాలకు చేరుకోలేకపోతున్నామని వాపోయారు. ఉదయం, సాయంత్రం వేళల్లో పాఠశాలల సమయానికి అనుగుణంగా తమ గ్రామానికి ప్రత్యేక బస్సు సర్వీసును ఏర్పాటు చేయాలని ఆర్టీసీ అధికారులను కోరారు. అధికారులు స్పందించి బస్సు సౌకర్యం కల్పించేలా చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరారు. కాగా, రహదారిపై విద్యార్థులు బైఠాయించడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

రేపు స్పాట్‌ అడ్మిషన్లు

నాగార్జునసాగర్‌ : నాగార్జునసాగర్‌ ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలలో వివిధ డిప్లొమా కోర్సుల్లో మిగిలి ఉన్న సీట్ల భర్తీకి శనివారం స్పాట్‌ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్‌ ఐలయ్య గురువారం తెలిపారు. పాలిసెట్‌–2026 లో ఉత్తీర్ణులైన విద్యార్థులతో పాటు, పాలిసెట్‌ రాయకపోయినా పదో తరగతిలో మంచి మార్కులతో ఉత్తీర్ణులైన విద్యార్థులు కూడా ఈ స్పాట్‌ అడ్మిషన్లకు అర్హులని స్పష్టం చేశారు. అర్హత గల విద్యార్థులు పైలాన్‌కాలనీలోని పాలిటెక్నిక్‌ కళాశాలకు వచ్చి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. శనివారం స్పాట్‌ అడ్మిషన్ల ప్రక్రియకు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులందరూ సర్టిఫికెట్లతో స్వయంగా హాజరుకావాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement