నల్లగొండ : ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) జిల్లాలో వేగంగా సాగుతోంది. ఇప్పటి వరకు మొత్తం 15,16,253 మంది ఓటర్లలో 98 శాతం మందికి బీఎల్‌ఓలు ఎన్యూమరేషన్ ఫారాలు పంపిణీ చేశారు. బుధవారం వరకు 14,85,928 మంది ఓటర్లకు ఫారాలు అందగా, 30,325 మందికి అందాల్సి ఉంది. జూలై 30లోగా ఎన్యూమరేషన్ ఫారాల సేకరణ పూర్తికానంది. జూలై 31న ముసాయిదా జాబితా విడుదల చేయనున్నారు. ఆగస్టు 1 నుంచి 30 వరకు అభ్యంతరాలు, దరఖాస్తులు స్వీకరించి, సెప్టెంబర్ 28లోపు పరిష్కరించనున్నారు. తర్వాత అక్టోబర్ 1న తుది ఓటరు జాబితా విడుదల కానుందని అధికారులు తెలిపారు.
నల్లగొండ పాలిటెక్నిక్‌లో స్పాట్ అడ్మిషన్లు
రామగిరి(నల్లగొండ) : నల్గొండలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో 2026–27 విద్యా సంవత్సరానికి వివిధ డిప్లొమా కోర్సుల్లో మిగిలిపోయిన సీట్ల భర్తీకి స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ సీహెచ్.నరసింహారావు తెలిపారు. పాలిసెట్–2026లో అర్హత సాధించిన వారితో పాటు, పదో తరగతి ఉత్తీర్ణులైన వారు కూడా ఈ నెల 3వరకు కళాశాలకు వచ్చి దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. మెకానికల్ ఇంజనీరింగ్ 26, సివిల్ ఇంజనీరింగ్ 17, ఎలక్ట్రికల్ వెహికల్ ఇంజనీరింగ్ 11, కంప్యూటర్ ఇంజనీరింగ్ 2తో కలిపి మొత్తం 56 సీట్లు ఖాళీగా ఉన్నాయని పేర్కొన్నారు. ఈనెల 4న జరిగే కౌన్సిలింగ్‌కు పాలిసెట్–2026 ర్యాంక్ కార్డు, పదో తరగతి మెమో, 4వ తరగతి నుంచి 10వ తరగతి వరకు స్టడీ సర్టిఫికెట్లు, ట్రాన్స్‌ఫర్ సర్టిఫికెట్, కుల, నివాస ధ్రువీకరణ పత్రాలు తీసుకుని రావాలని తెలిపారు. ప్రవేశం పొందేవారికి ఎలాంటి ఫీజు రీయింబర్స్‌మెంట్ వర్తించదని పేర్కొన్నారు.


