నల్లగొండ : నల్లగొండలోని ఎస్‌ఎల్‌బీసీ కాలనీ వద్ద నిర్మిస్తున్న ఇందిర మహిళా శక్తి పెట్రోల్ బంకు పనులను వారం రోజుల్లో పూర్తిచేసి ప్రారంభోత్సవానికి సిద్ధంచేయాలని కలెక్టర్ బి.చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు. బుధవారం ఆయన నిర్మాణ పనులను పరిశీలించి మాట్లాడారు. పెట్రోల్ బంకులో పనిచేసే మహిళా సిబ్బందికి ఇప్పటినుంచే ఐఓసీఎల్ ద్వారా శిక్షణ ఇప్పించాలని డీఆర్‌డీఓ అదనపు పీడీకి సూచించారు. పెట్రోల్ బంకు పక్కనే ఉన్న ఖాళీ స్థలంలో నిర్మించనున్న సూపర్ మార్కెట్, రెస్టారెంట్లకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చేతుల మీదుగా శంకుస్థాపన చేసేందుకు ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఇక్కడ ప్రత్యేక ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు చేసి ప్రస్తుతం ఉన్న విద్యుత్ లైన్లన్నింటినీ మార్చాలని ఆదేశించారు. రాష్ట్రంలోనే ఉత్తమ పెట్రోల్ పంపుగా తీర్చిదిద్దేందుకు కృషిచేయాలన్నారు. ఆధారం లేని, ఒంటరి మహిళలకు ఈ బంకులో ఉపాధి కల్పించాలన్నారు. ఈ తనిఖీలో డీఆర్‌డీఓ అదనపు ప్రాజెక్టు డైరెక్టర్ శ్రవణ్, విద్యుత్ ఏడీఈ. వేణుగోపాల్, డివిజనల్ ఇంజినీర్ ప్రసాదరావు, ఏఈ యాసిన్ అలీ పాల్గొన్నారు.
రైతు భరోసా.. రూ.189.26 కోట్లు
నల్లగొండ అగ్రికల్చర్ : రాష్ట్ర ప్రభుత్వం రెండు ఎకరాల వరకు రైతుభరోసా నిధులు రైతుల ఖాతాల్లో జమచేసినట్లు జిల్లా వ్యవసాయాధికారి ఉల్లోజు వినోద్‌కుమార్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎకరం భూమి ఉన్న 1,88,297మంది రైతులకు రూ.65,65,74,154, రెండు ఎకరాలు ఉన్న 1,34,839 రైతులకు రూ.123,60,58,171 జమచేసిందని పేర్కొన్నారు. ఇప్పటి వరకు 3,23,136 మంది రైతుల ఖాతాల్లో మొత్తం రూ.189,26,32,325 జమచేసిందని తెలిపారు.
స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌గా ప్రేమ్‌కరణ్‌రెడ్డి
నల్లగొండ: జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌గా నంద్యాల ప్రేమ్‌కరణ్ రెడ్డి బుధవారం ఉద్యోగ బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు నల్లగొండ ఆర్డీఓ అశోక్‌రెడ్డి స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌గా అదనపు బాధ్యతలు నిర్వహించారు. ఆయన స్థానంలో జిల్లా పరిషత్ ముఖ్య కార్య నిర్వహణ అధికారిగా పనిచేస్తున్న ప్రేమ్‌కిరణ్ రెడ్డికి అదనంగా బాధ్యతలు అప్పగించారు.
నేడు ఫుట్‌బాల్
జట్ల ఎంపిక
నల్లగొండ టూటౌన్ : నల్లగొండ సమీపంలోని చర్లపల్లి విపస్య స్కూల్‌లో ఈ నెల 2న ఉద యం 9 గంటలకు ఫుట్‌బాల్ సబ్ జూనియర్ బాలికల జట్ల సెలక్షన్స్ జరుగుతాయని ఫుట్‌బాల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ బండారు ప్రసాద్, చైర్మన్ గంట్ల అనంతరెడ్డి, సెక్రటరీ గిరిబాబు సంయుక్త ప్రకటనలో తెలిపారు. 2013, 2014, 2015 సంవత్సరాల్లో జన్మించిన ఆసక్తిగాల బాలికలు జనన ధ్రువీకరణ పత్రం, ఆధార్ కార్డు, నాలుగు పాస్ ఫొటోలతో హాజరుకావాలని పేర్కొన్నారు. ఇక్కడ ఎంపికై న క్రీడాకారులను త్వరలో నిజామాబాద్‌లో జరిగే స్టేట్ మీట్‌లో పాల్గొనే అర్హత పొందుతారని తెలిపారు.


