విధిగా టీకా వేయించాలి
నల్లగొండ అగ్రికల్చర్ : పశువుల్లో వ్యాపించే లంపీస్కిన్ డిసీజ్ (ముద్ధ చర్మ వ్యాధి) నివారణకు చేపట్టిన టీకాల కార్యక్రమం జిల్లాలో ముమ్మరంగా కొనసాగుతోంది. జిల్లా పశువైద్య సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో గత నెల 24న ప్రారంభమైన టీకాల కార్యక్రమం ఈ నెల 8వ తేదీ వరకు కొనసాగనుంది. జిల్లా వ్యాప్తంగా 1.40లక్షల పశువులు ఉండగా ఇప్పటి వరకు 45 వేల పశువులకు టీకాలు వేశారు. ఇందుకు అవసరమైన సిబ్బందిని నియమించింది.
లంపీస్కిన్ డిసీజ్ వ్యాప్తి ఇలా..
లంపీస్కిన్ డిసీజ్ పశువుల్లో వచ్చే వైరస్ వ్యాధి. ఇది కాప్రిపాక్స్ వైరస్ వల్ల వ్యాపిస్తుంది. ఈ వ్యాధి దోమలు, ఈగలు, పేలు వంటి రక్తం పీల్చే కీటకాల ద్వారా బాధిత పశువులతో ప్రత్యక్ష సంబంధం ద్వారా కలు షితమైన సూదులు, పరికరాల ద్వారా సోకుతుంది.
వ్యాధి లక్షణాలు : పశువులలో ఎక్కువ జ్వరం, శరీరంపై గట్టిగా ఉండే గడ్డలు, మెడ, భుజం, కాళ్ల వద్ద లింప్ గ్రంధుల వాపు, కళ్లనుంచి, ముక్కు నుంచి స్రావం, కాళ్లవాపు, కుంటుతూ నడవడం, పాల ఉత్పత్తి తగ్గడం, ఆకలి మందగించడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
నివారణ ఇలా : ఏటా టీకాలు వేయించాలి. బాధిత పశువులను వేరుగా ఉంచాలి. దోమలు, ఈగలను నియంత్రించాలి. పశువుల కొట్టాలు, షెడ్లను శుభ్రంగా ఉంచి క్రిమిసంహారక మందులను పిచికారీ చేయడం ద్వారా పశువుల్లో ఈ వ్యాధిని నివారించవచ్చు.
ఫ గతనెల 24 నుంచి ముద్ధ చర్మ వ్యాధి నివారణ టీకాలు
ఫ ఇప్పటి వరకు 45వేల పశువులకు అందజేత
ఫ 8వ తేదీ వరకు కొనసాగనున్న కార్యక్రమం
పశువుల యజమానులు విధిగా తమ పశువులకు టీకా వేయించాలలి. ప్రభుత్వం ఉచితంగా వేస్తున్న టీకాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి. ప్రతి సంవత్సరం లంపీస్కిన్ నివారణ టీకా వేయిస్తే పశువులు ఆరోగ్యంగా ఉంటాయి.
– డాక్టర్ జీవీ.రమేష్, జిల్లా పశువైద్య సంవర్ధక శాఖ అధికారి


