నల్లగొండ : రిజిస్ట్రేషన్ శాఖలో తలెత్తిన సర్వర్ సమస్యలు ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా ఆస్తుల రిజిస్ట్రేషన్లపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఈ నెల 26, 27, 28 తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా సర్వర్ మెయింటెనెన్స్ పనులు చేపట్టడంతో రిజిస్ట్రేషన్ సేవలు నిలిచిపోయాయి. అనంతరం మంగళవారం నుంచి సేవలు పునరుద్ధరించినప్పటికీ సర్వర్ పూర్తిస్థాయిలో పనిచేయకపోవడంతో స్లాట్ బుకింగ్‌లు నత్తనడకన సాగుతున్నాయి. ఫలితంగా ఆస్తుల కొనుగోలు, విక్రయాలకు సంబంధించిన రిజిస్ట్రేషన్లు నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఉమ్మడి జిల్లాలో 15 సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులు
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మొత్తం 15 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉండగా, ప్రతిరోజూ సగటున 350 నుంచి 400 వరకు రిజిస్ట్రేషన్లు జరుగుతుంటాయి. పెద్ద కార్యాలయాల్లో రోజుకు 50 నుంచి 60 వరకు, చిన్న వాటిల్లో ఐదు నుంచి పది వరకు డాక్యుమెంట్లు నమోదవుతుంటాయి. ముఖ్యంగా నల్లగొండ జిల్లా కేంద్రంలోని కార్యాలయంలో రోజుకు 50 నుంచి 70 వరకు స్లాట్ బుకింగ్‌లు జరుగుతాయి. అయితే మంగళవారం సర్వర్ సమస్యల కారణంగా కేవలం 16 స్లాట్‌లు మాత్రమే నమోదయ్యాయి. ఇది సర్వర్ సమస్య తీవ్రతను స్పష్టంగా తెలియజేస్తోంది. రెండు రోజులుగా సర్వర్ సమస్యల కారణంగా స్లాట్‌లు బుక్ కాకపోవడంతో రిజిస్ట్రేషన్ ప్రక్రియ దాదాపు స్థంభించింది.
స్లాట్ బుకింగ్‌కు అవస్థలు
స్లాట్ బుక్ చేసుకునేందుకు మీసేవ కేంద్రాలకు వెళ్లిన ప్రజలు గంటల తరబడి వేచి చూసినా ప్రయోజనం లేక నిరాశతో వెనుదిరుగుతున్నారు. రిజిస్ట్రేషన్ ఆలస్యం కావడంతో బ్యాంకు రుణాలు, మార్టిగేజ్ నమోదు, ఇతర ఆర్థిక లావాదేవీలు కూడా నిలిచిపోయాయి. దీంతో కొందరు రిజిస్ట్రేషన్లు వాయిదా వేసుకుంటున్నారు. సాధారణంగా కొనుగోలుదారులు, విక్రేతలు, డాక్యుమెంట్ రైటర్లు, స్టాంప్ విక్రేతలు, న్యాయవాదులతో రద్దీగా ఉండే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ప్రస్తుతం వెలవెలబోతున్నాయి. స్లాట్ బుకింగ్‌లు లేకపోవడంతో అధికారులు, సిబ్బంది కూడా ఖాళీగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.
సర్వర్ సమస్యతో స్లాట్ బుకింగ్‌కు ఆటంకం
ఫ మూడు రోజులుగా నిలిచిన సేవలు
ఫ మీసేవ కేంద్రాల చుట్టూ ప్రదక్షిణలు
ఫ సేవలు పునరుద్ధరించినా మొరాయించిన సర్వర్
ఫ ఇబ్బందుల్లో ఆస్తుల కొనుగోలు, అమ్మకందారులు


