మిర్యాలగూడ : ప్రభుత్వ పాఠశాలలను ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్ పాఠశాలలుగా మార్చి విద్యార్థుల ఇబ్బందులను తొలగించాలని మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి అన్నారు. మంగళవారం మిర్యాలగూడ పట్టణంలోని బకల్‌వాడ ప్రభుత్వ ఉన్నత పాఠశాలను ఆయన సందర్శించి విద్యార్థులు, సిబ్బంది ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన విద్యార్థులతో కలిసి భోజనం చేసి మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలలను ఇంటిగ్రేటెడ్ పాఠశాలగా మార్చడం ద్వారా విద్యార్థులకు అన్ని సౌకర్యాలు సమకూరుతాయన్నారు. వంట చేసే సిబ్బందికి సకాలంలో బిల్లులు చెల్లించాలన్నారు. పాఠశాలలో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయుల నియామకాలు జరగాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ పబ్లిక్ స్కూల్స్‌ను నియోజకవర్గానికి ఒక్కటే కాకుండా ప్రతి మండలానికి మూడు పాఠశాలలను ఏర్పాటు చేసి అన్ని సౌకర్యాలు కల్పించి నాణ్యమైన విద్యను అందించాలన్నారు. కార్యక్రమంలో వెంకటేశ్వర్లు, రవినాయక్, మల్లు గౌతంరెడ్డి, పాండు, రామ్మూర్తి, సిబ్బంది ఉన్నారు.
ఫ మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి


