కోతులు బెదిరె.. అడవి పందులు అదిరె.. | - | Sakshi
Sakshi News home page

కోతులు బెదిరె.. అడవి పందులు అదిరె..

Jun 30 2026 7:01 AM | Updated on Jun 30 2026 7:01 AM

ధైర్యంగా పంటలు వేస్తున్నాం

సౌర కంచెలతో తప్పిన నష్టం

తుర్కపల్లి : అడవి జంతువుల బెడదతో వ్యవసాయంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులకు సౌర కంచెలు వరంగా మారాయి. వర్షాధార పంటలను వదిలి, కేవలం వరి సాగుకే పరిమితమవుతున్న పరిస్థితుల్లో.. ‘పిలుపు’ సంస్థ ఆధ్వర్యంలో నాబార్డు సహకారంతో అమలు చేసిన ‘కై ్లమేట్‌ ప్రూఫింగ్‌ ప్రాజెక్ట్‌’ ఆశాజనక ఫలితాలిస్తోంది. తుర్కపల్లి మండలంలో ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేసిన ఈ సౌర కంచెలతో రైతులు ఇప్పుడు ధీమాగా కూరగాయల సాగు చేపట్టి మంచి ఆదాయం పొందుతున్నారు.

కూరగాయల సాగుపై మళ్లీ ఆసక్తి..

తుర్కపల్లి మండలంలో గతంలో రైతులు వర్షాధార పంటలతో పాటు కూరగాయలు పండించేవారు. అయితే అడవి పందులు, కోతుల బెడద తీవ్రం కావడంతో.. చేతికొచ్చే దశలో పంటలు నాశనమై తీవ్ర ఆర్థిక నష్టాలు చవిచూశారు. ముఖ్యంగా టమాట, మిర్చి, బెండ, వంకాయ, దోసకాయ వంటి పంటలకు భారీ నష్టం వాటిల్లుతుండటంతో రైతులు పూర్తిగా వరి సాగుకు పరిమితమయ్యారు. దీంతో పంటల వైవిధ్యంతో పాటు ఆదాయం కూడా తగ్గిపోయింది. ఈ సమస్య పరిష్కారానికి ‘పిలుపు’ సంస్థ, నాబార్డు సహకారంతో కై ్లమేట్‌ ప్రూఫింగ్‌ ప్రాజెక్ట్‌ను చేపట్టింది. ప్రయోగాత్మకంగా నలుగురు రైతులకు సౌర కంచెలు ఏర్పాటు చేసి కూరగాయల సాగును ప్రోత్సహించింది. ఒక్కో కంచె ఏర్పాటుకు సుమారు రూ.30వేలు ఖర్చు కాగా.. అందులో రూ.19 వేల వరకు నాబార్డు ఆర్థిక సాయం అందించింది. మిగతా రూ.11వేలు రైతు భరించాల్సి ఉంటుంది. సౌరశక్తితో పనిచేసే ఈ కంచెలు అడవి జంతువులను సమర్థంగా అడ్డుకుంటున్నాయి. దీంతో రైతులు రాత్రింబవళ్లు పొలాల వద్ద కాపలా కాయాల్సిన అవసరం తప్పింది. పంట నష్టం గణనీయంగా తగ్గడంతో.. రైతులు మళ్లీ కూరగాయల సాగుపై ఆసక్తి చూపుతున్నారు.

మరో 26 మందికి..

ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేసిన సౌర కంచెలు సత్ఫలితాలు ఇవ్వడంతో మరికొందరు రైతులు సైతం వీటి ఏర్పాటుకు ముందుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో ‘ఆర్డీఎస్‌ఎస్‌’ సంస్థ సహకారంతో మరో 26మంది రైతులకు సౌర కంచెలు ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టారు. ఈ విధానంతో అడవి జంతువుల బెడదను నివారించడమే కాకుండా వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చవచ్చని రైతుల అనుభవాలు స్పష్టం చేస్తున్నాయి. ప్రభుత్వం, స్వచ్ఛంద, ఆర్థిక సంస్థల సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని విస్తరిస్తే రైతులకు భరోసా లభిస్తుందని వ్యవసాయ నిపుణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

జంతువులకు ఎలాంటి హాని ఉండదు..

కోతులు, అడవి పందులు సౌర కంచెకు తాకగానే అలారం మోగుతుంది. చిన్నపాటి షాక్‌ తగిలి అవి పంటకు దూరంగా వెళ్తాయి. సౌర కంచెల ద్వారా జంతువులకు ఎలాంటి హాని ఉండదు.

ఒకప్పుడు వ్యవసాయం అంటే నష్టాలే గుర్తొచ్చేవి. ఇప్పుడు సౌర కంచె వల్ల ధైర్యంగా పంటలు సాగుచేస్తున్నాం. కుటుంబ సభ్యులతో కలిసి ప్రశాంతంగా వ్యవసాయం చేసుకుంటున్నాం. జంతువుల బెడదను వంద శాతం నియంత్రించడం సాధ్యం కాకపోయినా.. సౌర కంచెలు సమర్థవంతమైన రక్షణ వ్యవస్థగా పనిచేస్తున్నాయి. వాతావరణ మార్పుల నేపథ్యంలో ఇలాంటి చర్యలు వ్యవసాయాన్ని స్థిరంగా ఉంచడంలో కీలకపాత్ర పోషిస్తాయి.

– కొడారి కిష్టయ్య, రైతు, మల్కాపురం

పంటలను కాపాడుతున్న సౌర కంచె

మళ్లీ కూరగాయల సాగుబాటలో

తుర్కపల్లి రైతులు

నాబార్డు కై ్లమేట్‌ ప్రూఫింగ్‌ ప్రాజెక్ట్‌ సక్సెస్‌

గతంలో అడవి పందులు, కోతుల భయంతో కూరగాయల సాగు చేయలేకపోయేవాళ్లం. పంట చేతికొచ్చే సమయంలో నాశనం చేసేవి. రాత్రంతా పొలాల వద్దే కాపలా కాయాల్సి వచ్చేది. సౌర కంచె ఏర్పాటు చేశాక పరిస్థితి పూర్తిగా మారింది. పంట నష్టం తగ్గింది. ఇప్పుడు టమాట, మిర్చి, బెండ సాగు చేస్తూ మంచి ఆదాయం పొందుతున్నాం. ప్రభుత్వం మరింత సబ్సిడీ ఇస్తే ఎక్కువ మంది రైతులు ముందుకొస్తారు. – మోహన్‌, రైతు, ధర్మారం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement