తరలిపోయిన విద్యాసంస్థలు | - | Sakshi
Sakshi News home page

తరలిపోయిన విద్యాసంస్థలు

Jun 30 2026 7:01 AM | Updated on Jun 30 2026 7:01 AM

ఉపాధి కోల్పోతున్న యువత

నాగార్జునసాగర్‌, పెద్దవూర : గ్రామీణ ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలే కీలకమని అందరూ భావిస్తుంటే.. పెద్దవూర మండల పరిధిలో మాత్రం పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. ఇక్కడికి మంజూరైన లేదా ప్రతిపాదించిన పలు ప్రతిష్టాత్మక విద్యాసంస్థలు, కార్యాలయాలు ఇతర ప్రాంతాలకు తరలిపోతుండటం స్థానికుల్లో తీవ్ర ఆందోళన, అసంతృప్తిని రేకెత్తిస్తోంది. మండల, గ్రామ స్థాయిల్లో పరిపాలన, విద్యా వ్యవస్థలు బలోపేతమైతేనే దేశాభివృద్ధి సాధ్యమన్న పెద్దల మాటలు ఇక్కడ కాగితాలకే పరిమితమవుతున్నాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

చేజారిన ప్రతిష్టాత్మక సంస్థలు..

● గతంలో నాగార్జునసాగర్‌లో ఏర్పాటుకు సన్నద్ధమైన జవహార్‌లాల్‌ నెహ్రూ టెక్నాలజికల్‌ యూనివర్శిటీ (జేఎన్‌టీయూ), బీఆర్‌.అంబేద్కర్‌ ఓపెన్‌ యూనివర్శిటీలు తదనంతర కాలంలో హైదరాబాద్‌కు తరలివెళ్లాయి. జేఎన్‌టీయూ మొదటి బ్యాచ్‌ విద్యార్థుల సర్టిఫికెట్లపై ఇప్పటికీ ‘జేఎన్‌టీయూ నాగార్జునసాగర్‌’ అనే ఉండటం గమనార్హం.

● మహాత్మా గాంధీ వర్సిటీ, బీఈడీ కాలేజ్‌ ఇక్కడే ఏర్పాటు చేయాలని సర్వేలు జరిగినప్పటికీ మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం చివరకు నల్లగొండకు తరలిపోయింది. అలాగే సాగర్‌లో విజయవంతంగా కొనసాగిన ప్రతిష్టాత్మక బీఈడీ కళాశాలను సైతం నల్లగొండకు మార్చారు.

● గతంలో పెద్దవూర మండలానికి మోడల్‌ స్కూల్‌ మంజూరైనప్పటికీ, స్థల సమస్యల కారణంగా అది పట్టాలెక్కకుండానే రద్దయింది.

ఇటీవల కాలంలోనూ అదే తీరు

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ స్కూల్‌ ఏర్పాటు కోసం నాగార్జునసాగర్‌తో పాటు పెద్దవూర మండలంలోని చలకుర్తి (నవోదయ విద్యాలయం సమీపంలో) ప్రాంతాల్లో స్థల పరిశీలన చేశారు. కానీ, చివరకు దీన్ని నిడమనూరు మండలం ఊట్కూర్‌కు తరలించారు. తాజాగా పెద్దవూర మండలానికి మంజూరైన తెలంగాణ పబ్లిక్‌ స్కూల్‌ను ప్రారంభదశలోనే హాలియాకు తరలించడం స్థానికులను తీవ్ర నిరాశకు గురిచేసింది. మహాత్మా జ్యోతిబాపూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల డిగ్రీ కళాశాలకు అవసరమైన ప్రభుత్వ భవనాలు నాగార్జునసాగర్‌లో సిద్ధంగా ఉన్నప్పటికీ.. అధికారులు మాత్రం నిడమనూరు మండల కేంద్రం సమీపంలోని ఒక ప్రైవేటు భవనంలోకి మార్చడం విమర్శలకు తావిస్తోంది.

పాలనా కార్యాలయాలూ అంతే..

కేవలం విద్యాసంస్థలే కాకుండా కీలకమైన ప్రభుత్వ కార్యాలయాలు కూడా ఈ ప్రాంతం నుండి తరలిపోతున్నాయి. గతంలో పెద్దవూరలోనే సేవలందించిన ఐసీడీఎస్‌ కార్యాలయాన్ని సైతం హాలియాకు మార్చడంతో స్థానికులకు ఇబ్బందులు తప్పడం లేదు.

ఫ గతంలో పెద్దవూర మండలంలో జేఎన్‌న్టీయూ, ఓపెన్‌ యూనివర్సిటీ, బీఈడీ కళాశాల ఏర్పాటుకు ప్రయత్నాలు

ఫ కొన్ని కారణాల వల్ల జిల్లాలోని

ఇతర ప్రాంతాలకు తరలింపు

ఫ పాలనా కార్యాలయాలూ మరోచోటుకు..

పెద్దవూర, నాగార్జునసాగర్‌ ప్రాంతాల్లో సొంత భవనాలు, రవాణా సౌకర్యాలు, ఇతర మౌలిక వసతులు పుష్కలంగా అందుబాటులో ఉన్నాయి. అయినప్పటికీ విద్యాసంస్థలు, కార్యాలయాలు వేరే ప్రాంతాలకు తరలిపోవడం వల్ల స్థానిక విద్యార్థులు, నిరుద్యోగ యువత మంచి అవకాశాలను కోల్పోతున్నారు. ఇకనైనా ప్రభుత్వం, స్థానిక ప్రజాప్రతినిధులు తక్షణమే స్పందించి.. మండలానికి మంజూరైన సంస్థలను స్థానికంగానే ఏర్పాటు చేసి ఈ ప్రాంత విద్యాభివృద్ధికి తోడ్పడాలని పెద్దవూర, నాగార్జునసాగర్‌ వాసులు గట్టిగా డిమాండ్‌ చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement