మిర్యాలగూడ అర్బన్ : మిర్యాలగూడ పట్టణంలోని డాక్టర్స్ కాలనీలో పలు ప్రైవేట్ ఆస్పత్రులు, స్కానింగ్ సెంటర్లు, ల్యాబ్‌లను సోమవారం నల్ల గొండ జిల్లా వైద్యాధికారి(డీఎంహెచ్‌ఓ) కె.రాహుల్ తనిఖీ నిర్వహించారు. ఆయా ఆస్పత్రులకు సంబంధించిన అనుమతి పత్రాలతో పాటు వైద్యుల విద్యార్హతల రికార్డులను పరిశీలించారు. వైద్యశాఖ నుంచి అనుమతి పొందిన గడువు ముగిసినప్పటికీ రెన్యువల్ చేయించుకోని 30 ఆస్పత్రులను గుర్తించి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. అదేవిధంగా బహుళ అంతస్తుల సెల్లార్లలో నిర్వహిస్తున్న శ్రీసాయి జనరల్ ఆస్పత్రి, రుద్ర డయాగ్నస్టిక్ సెంటర్లను సీజ్ చేసి నోటీసులు జారీ చేశారు. అనంతరం డీఎంహెచ్‌ఓ మాట్లాడుతూ.. డాక్టర్స్ కాలనీలోని పలు ప్రైవేట్ ఆస్పత్రులు నిబంధనలకు విరుద్ధంగా నడిపిస్తున్నట్లు గుర్తించామని, సెల్లార్లలో ఆస్పత్రులు, ల్యాబ్‌లు ఏర్పాటు చేయడం వలన రోగులు ఇబ్బందులు పడే అవకాశం ఉందని తెలిపారు.
పద్మావతి ఆస్పత్రిపై పోలీసులకు ఫిర్యాదు..
ఈ నెల 26న గర్భిణికి అబార్షన్ చేసేందుకు యత్నించిన డాక్టర్స్ కాలనీలోని పద్మావతి హాస్పిటల్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశామని, షోకాజ్ నోటీసు సైతం ఇచ్చామని డీఎఎంహెచ్‌ఓ తెలిపారు. సదరు గర్భిణి ఇదే కాలనీలోని మోనికా స్కానింగ్ సెంటర్‌లో స్కానింగ్ చేయించుకుందని, అక్కడ కూడా వివరాలు సేకరించామని, ఆ స్కానింగ్ సెంటర్‌లో కొన్ని లోపాలను గుర్తించామని ఆయన పేర్కొన్నారు. పూర్తి విచారణ అనంతరం తదుపరి చర్యలు తీసుకుంటామని వివరించారు. ఆయన వెంట జిల్లా మలేరియా అధికారి కె. నగేష్, హెల్త్ ఎడ్యుకేటర్ ఎ. అంజయ్యగౌడ్, సీసీ రంజిత్‌కుమార్ పాల్గొన్నారు.
ఫ గడువు ముగిసిన, లైసెన్స్ రెన్యువల్
చేసుకోని ఆస్పత్రులకు నోటీసులు
ఫ సెల్లార్‌లో నిర్తహిస్తున్న ఆస్పత్రి, ల్యాబ్ సీజ్


