భూదాన్‌పోచంపల్లి : సమస్యల పరిష్కారం వైపు విద్యార్థులను ప్రోత్సహించడం వల్ల నూతన ఆవిష్కరణలు పుట్టుకొస్తాయని ఐఐటీ బాంబే ప్రొఫెసర్ రవి పూవయ్య అన్నారు. సోమవారం భూదాన్‌పోచంపల్లి మండలంలోని దేశ్‌ముఖిలోని విజ్ఞాన్స్ యూనివర్సిటీలో శ్రీడిజైన్ థింకింగ్ అండ్ ఇన్నోవేషన్‌శ్రీ మూడు రోజుల ఫ్యాకల్టీ వర్క్‌షాప్‌ను ఆయన జ్యోతి వెలిగించి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మన దేశం, ప్రపంచం ఎదుర్కొంటున్న క్లిష్టమైన సమస్యలను పరిష్కరించి, నూతన ఆవిష్కరణలపై దృష్టి పెట్టాలని అన్నారు. రిటైర్డ్ ఐఏఎస్ అధికారిణి, యూనివర్సిటీ అడ్వైజర్ పూనం మాలకొండయ్య మాట్లాడుతూ.. ప్రజల నిజమైన అవసరాలను గుర్తించడమే డిజైన్ థింకింగ్ ఇన్నోవేషన్ ముఖ్య ఉద్దేశమని అన్నారు. సాంకేతిక ప్రపంచంలో మానవీయ విలువలు తగ్గిపోతున్న తరుణంలో ఇలాంటి వర్క్‌షాపులు ఎంతగానో దోహదపడుతాయని అన్నారు. అనంతరం ముంబై జెల్లో ల్యాబ్స్ ఫౌండర్ అండ్ డైరెక్టర్ డాక్టర్ అజంతా సేన్ మాట్లాడుతూ.. విపత్తుల, రిస్క్‌ను తగ్గిస్తూ మనిషి మనుగడ సాగించేలా సరికొత్త విద్యావిధానం వచ్చినపుడే ఉపాధ్యాయులుగా రాణించగలుగుతారని అన్నారు. ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ డైరెక్టర్ ప్రొఫెసర్ దాసేశ్వర్‌రావు, ఆయా విభాగాల హెచ్‌ఓడీలు, అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు.


