పత్తిపై పరిమితి ఎత్తివేత
ఏఈఓ క్షేత్రస్థాయిలో పరిశీలించాలి
ఎకరాకు 12 క్వింటాళ్ల కొనుగోలుకు సీసీఐ అంగీకారం
మునుగోడు : పత్తి రైతులకు కొంత ఊరట లభించింది. సీసీఐలో గతేడాది ఎకరాకు 12 క్వింటాళ్ల పత్తి కొనుగోలు చేసిన అధికారులు ఈ ఏడాది 7 క్వింటాళ్లకు కుదించారు. కొత్తగా తీసుకొచ్చిన కపాస్ కిసాన్ యాప్ ద్వారా స్లాట్ బుకింగ్ విధానంలో ఎకరాకు 7 క్వింటాళ్ల పత్తి మాత్రమే దిగుమతి చేసుకునేలా ఏర్పాట్లు చేశారు. దీంతో పత్తి సాగుచేసిన రైతులు ఆందోళన చెందారు. ఈ విషయంపై పలువురు ప్రజా ప్రతినిధులతో పాటు రైతులు, జిన్నింగ్ మిల్లు యజమానులు 12 క్వింటాళ్లు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. అందుకు సమ్మతించిన కేంద్ర ప్రభుత్వం ఎకరాకు 12 క్వింటాళ్ల వరకు కొనుగోలు చేసేలా కపాస్ కిసాన్ యాప్‌లో అనుమతి ఇచ్చింది. కానీ గతంలో మాదిరిగా రైతులు నేరుగా అమ్ముకునేందుకు వీల్లేకుండా అధిక దిగుబడి వచ్చినట్లు ఏఈఓ ధ్రువీకరిస్తేనే ఎకరాకు 12 క్వింటాళ్ల వరకు కొనుగోలు చేసేలా నిబంధన విధించింది.
జిల్లాలో 5.38 లక్షల ఎకరాల్లో సాగు..
జిల్లాలోని 33 మండలాలల్లో ఈ ఏడాది మొత్తం 12 లక్షల 148 ఎకరాలల్లో వివిధ పంటలు సాగుచేయగా అందులో అత్యధికంగా 5,38,085 ఎకరాల్లో పత్తి పంట సాగు చేశారు. అయితే మొదట వ్యవసాయ అధికారులు ఎకరానికి సగటున 8 క్వింటాళ్ల దిగుబడి చొప్పున 43,04,680 క్వింటాళ్ల దిగుబడి వస్తుందని అంచనా వేశారు. కానీ ఈ ఏడాది అకాల వర్షాలు కురవడంతో పంటకు తెగుళ్ల సోకి ఎకరాకు ఒకటి, రెండు క్వింటాళ్లు తగ్గుతుందని అంచనా వేశారు. అయితే వ్యవసాయ అధికారుల అంచనా ప్రకారం ఎర్ర నేలలు, చౌవుడు నేలల్లో సాగుచేసిన పంట మాత్రం తక్కువ దిగుబడి వచ్చింది. నల్లరేగడి భూముల్లో సాగుచేసిన పంట అధికారుల అంచనా కంటే అధికంగా ఎకరానికి 10 క్వింటాళ్ల నుండి 15 క్వింటాళ్ల వరకు దిగుబడి వచ్చింది.
ఎకరాకు 12 క్వింటాళ్ల వరకు సీసీఐలో అమ్ముకోవాలనుకునే రైతులు తమ పట్టా పాస్ పుస్తకంతో పాటు ఆధార్‌కార్డు జతచేసి ఏఈఓకి దరఖాస్తు చేసుకోవాలి. సంబంధిత ఏఈఓ ఆ రైతు భూమి వద్దకు వెళ్లి నిజంగా ఎంత దిగుబడి వచ్చిందో నిర్ధారిస్తారు. ఆ తరువాత కపాస్ కిసాన్ యాప్‌లో ఆ రైతు పేరుతో అదనంగా ఎంత దిగుబడి వస్తే అంతా (7 నుంచి 12 క్వింటాళ్లలోపు) నమోదు చేస్తాడు. ఆ సమయంలో ఆ రైతు ఆధార్‌కార్డుకు లింకు ఉన్న ఫోన్ నంబర్‌కు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ చెప్పితే ఆ రైతు పేరుమీద ఏఈఓ ఎంత నమోదు చేస్తే అంత అప్‌లోడ్ అవుతుంది. ఆ తరువాత రైతు తమ పత్తి అమ్ముకునేందుకు కపాస్ కిసాస్ యాప్‌లో స్లాట్ బుక్ చేసుకోవాలి. ఇలా మునుగోడు మండలంలో దాదాపు 100 మందికిపైగా రైతులు ఏఈఓల వద్ద ధ్రువీకరణ పొంది తమ పత్తి దిగుమతి పెంచుకున్నారు. ఈ విషయం తెలిసినా మరి కొంత మంది రైతులు ఆనందం వ్యక్తంచేస్తూ తమ పంట దిగుబడి పెంచుకునేందుకు ఏఈఓలను ఆశ్రయిస్తున్నారు.
ఫ ఏఈఓ ధ్రువీకరించాలని నిబంధన
ఫ హర్షం వ్యక్తం చేస్తున్న రైతులు


