మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాలు
● జిల్లాకు అత్యధికంగా
రూ.26.34 కోట్లు కేటాయింపు
● నేడు నియోజకవర్గ కేంద్రాల్లో పంపిణీ
● పాల్గొననున్న ప్రజాప్రతినిధులు
నల్లగొండ : స్వయం సహాయక సంఘాల మహిళలు పలు వ్యాపారాలు నిర్వహించి ఆర్థిక సాధికారత సాధించేలా ప్రభుత్వం ప్రభుత్వం వడ్డీ లేని రుణాలు అందిస్తోంది. గడిచిన రెండేళ్లలో ప్రభుత్వం రూ.66.78 కోట్లు వడ్డీ లేని రుణాలను అందించింది. 2023–24 సంవత్సరంలో 21,235 సంఘాలకు రూ.19.06 కోట్లు, 2024–25లో 20,501 సంఘాలకు రూ.21.34 కోట్లు, 2024–25లో 22,997 సంఘాలకు రూ.26.37 కోట్ల వడ్డీలేని రుణాలు అందించింది. తాజాగా ప్రభుత్వం రాష్ట్రంలోనే అత్యధికంగా రూ.26.34 కోట్ల వడ్డీ లేని రుణాలను జిల్లాకు కేటాయించింది. ఈ రుణాలను ఆయా నియోజవర్గ ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా మంగళవారం నుంచి పంపిణీ చేయనుంది.
ఎమ్మెల్యేల చేతులమీదుగా..
వడ్డీ లేని రుణాల పంపిణీ కార్యక్రమాన్ని మంగళవారం జిల్లాలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమాలకు సంబంధిత శాసనసభ్యులు అధ్యక్షత వహిస్తారు. మంత్రులు, పార్లమెంట్ సభ్యులు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు హాజరుకానున్నారు. నకిరేకల్ నియోజకవర్గానికి సంబంధించి వడ్డీ లేని రుణాల పంపిణీ కార్యక్రమాన్ని నకిరేకల్‌లోని శకుంతల ఫంక్షన్‌హాల్‌లో మధ్యాహ్నం 2 గంటలకు, మిర్యాలగూడలో ఎన్‌ఎస్పీ క్యాంపులోని కళావేదికలో ఉదయం 10 గంటలకు, నాగార్జునసాగర్ నియోజకవర్గానికి సంబంధించి హాలియాలోని చైతన్య ఫంక్షన్ హాల్‌లో ఉదయం 10 గంటలకు, దేవరకొండలోని వైష్ణవి ఫంక్షన్ హాల్‌లో మధ్యాహ్నం 1.30 గంటలకు, నల్లగొండ నియోజకవర్గానికి సంబంధించి కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఉదయం 11 గంటలకు నిర్వహించనున్నారు. వడ్డీ లేని రుణాల పంపిణీలో భాగంగా మహిళా సంఘాలకు చెక్కులు అందజేయనున్నారు.


