
పోలీస్ గ్రీవెన్స్‌లో వినతుల స్వీకరణ
నల్లగొండ : జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం ఎస్పీ శరత్‌చంద్ర పవార్ 48 మంది బాధితుల నుంచి వినతులు స్వీకరించారు. బాధితులతో నేరుగా మాట్లాడి సమస్య తెలుసుకొని సంబంధిత అధికారులతో ఫోన్‌లో మాట్లాడారు. పూర్తి వివరాలు సమర్పించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాధితుల సమస్యను వెంటనే పరిష్కరించాలని పోలీసు అధికారులకు తెలిపారు. పోలీస్‌స్టేషన్‌కి వచ్చిన ఫిర్యాదుదారులతో మర్యాదగా మాట్లాడి వినతులు స్వీకరించి సంబంధిత ఫిర్యాదులపై క్షేత్రస్థాయిలో విచారించి చట్ట పరంగా బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని పోలీసులను ఆదేశించారు. శాంతి భద్రతలకు భంగం కలిగించే వారిపై కఠినంగా వ్యవహరించాలన్నారు.
ఎస్‌జీటీలకు పదోన్నతి
నల్లగొండ : విద్యాశాఖలో పదోన్నతుల ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికే స్కూల్ అసిస్టెంట్‌ల నుంచి గెజిటెడ్ హెడ్మాస్టర్లుగా పదోన్నతులు కల్పించిన విషయం తెలిసిందే. కాగా సోమవారం ఎస్‌జీటీకు స్కూల్ అసిస్టెంట్‌లుగా పదోన్నతి కల్పించింది. జిల్లాలో 156 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఖాళీగా ఉండగా.. వాటిని పదోన్నతుల ద్వారా భర్తీ చేసేందుకు విద్యాశాఖ ఎస్‌జీటీల్లో సీనియార్టీ జాబితాను ఇప్పటికే ప్రకటించి 1:1 ప్రకారం ఎంపిక చేసింది. సోమవారం సాయంత్రం పదోన్నతులు కల్పించిన ఉపాధ్యాయులకు వెబ్ ఆప్షన్లకు అవకాశం కల్పించింది. సోమవారం రాత్రి పోస్టింగ్ ఆర్డర్లను జారీ చేసింది. వారంతా మంగళవారం వారు విధుల్లో చేరాల్సి ఉంటుంది. పదోన్నతులు ఇష్టం లేని ఉపాధ్యాయులు 15 రోజుల్లోగా పదోన్నతి వద్దని రాసిస్తే ఆ ఉపాధ్యాయులకు యథాస్థానంలోనే పోస్టింగ్ ఉంటుంది.
అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లలో శిక్షణ
నల్లగొండ : పదో తరగతి ఉత్తీర్ణత పొంది, ఇంటర్, డిగ్రీ, బీటెక్ మధ్యలో ఆపేసిన వారికి టాటా గ్రూప్స్ సహకారంతో అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లను ప్రారంభించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి ఎన్.పద్మ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సెంటర్లలో కంపెనీలకు అవసరమైన నైపుణ్యాన్ని విద్యార్థులకు టాటా గ్రూప్స్ ట్రైనర్స్‌తో ఆధునిక యంత్రాలపై శిక్షణ ఇచ్చిన అనంతరం కంపెనీల్లో నేరుగా ఉద్యోగాలు కల్పిస్తారని తెలిపారు. అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని, దరఖాస్తు చేసే విధానం, గడువు, అర్హత తదితర పూర్తి వివరాలకు జిల్లా ఉపాధి కల్పన కార్యాలయం, నల్లగొండలో నేరుగా సంప్రదించాలని సూచించారు.
ఆశాలకు వేతనం రూ.18వేలు ఇవ్వాలి
నల్లగొండ టౌన్ : ప్రభుత్వం ఆశ కార్యకర్తలకు రూ.18 వేలు ఫిక్స్‌డ్ వేతనం ఇవ్వాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు చినపాక లక్ష్మీనారాయణ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. సోమవారం సీఐటీయూ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట నిర్వహించిన ధర్నాలో ఆయన మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆశ వర్కర్లతో వెట్టిచాకిరీ చేయించుకుంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కనీస వేతనాల చట్టం 1948 ప్రకారం రూ.26 వేల వేతనం ఇవ్వాల్సి ఉండగా రూ.9,500 ఇస్తున్నారన్నారు. ఆశ వర్కర్ల సమస్యల పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ వచ్చేనెల 1న ‘చలో హైదరాబాద్ కమిషనర్ కార్యాలయం’ కార్యక్రమానికి ఆశలు పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు. అనంతరం కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో మహేశ్వరి, వెంకటమ్మ, రవీందర్, సత్యనారాయణ, సుధీర్, పెంజర్ల సైదులు, వసంత, స్వర్ణ, జ్యోతి, వెంకటమ్మ, అనూష, కవిత, పుష్పలత తదితరులు ఉన్నారు.

పోలీస్ గ్రీవెన్స్‌లో వినతుల స్వీకరణ

పోలీస్ గ్రీవెన్స్‌లో వినతుల స్వీకరణ