
పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందిస్తాం
నల్లగొండ టౌన్ : పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం పని చేస్తోందని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రిలో సుమారు రూ.కోటి వ్యయంతో ఏర్పాటు చేసిన లాప్రోస్కోపిక్ యూనిట్‌ను సోమవారం పద్మ విభూషణ్ డాక్టర్ నాగేశ్వర్‌రెడ్డితో కలిసి ప్రారంభించారు. అనంతరం మెడికల్ కళాశాలలో విద్యార్థులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ ప్రపంచంలోనే గర్వించదగ్గ పద్మ విభూషణ్, గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ డాక్టర్ నాగేశ్వర్‌రెడ్డి చేతుల మీదుగా లాప్రోస్కోపిక్ యూనిట్ ప్రారంభించడం సంతోషకరమన్నారు. లాప్రోస్కోపిక్ యూనిట్ ఏర్పాటు చేయడం వల్ల చిన్నచిన్న ఆపరేషన్లు ఇక్కడే నిర్వహించవచ్చన్నారు. ప్రభుత్వ వైద్య కళాశాలలో మెడికల్ విద్య పూర్తి చేసిన విద్యార్థులకు ఏఐజీ ఆసుపత్రిలో ఇంటర్న్‌షిప్ చేసేందుకు అవకాశం కల్పించాలని మంత్రి నాగేశ్వర్‌రెడ్డిని కోరారు. ప్రభుత్వ ఆసుపత్రి నుంచి జీజీహెచ్‌కు వెళ్లేందుకు ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా బస్సు సౌకర్యం ఏర్పాటు చేశామని తెలిపారు. డాక్టర్ నాగేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో అత్యాధునిక, ఉన్నతస్థాయి ప్రమాణాలు కలిగిన లాప్రోస్కోపిక్ యూనిట్ ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. దీని ద్వారా పేదలు వివిధ రకాల శస్త్రచికిత్సలకు హైదరాబాద్ వెళ్లాల్సిన అవసరం లేదన్నారు. గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ జీవీ రావు మాట్లాడుతూ నల్లగొండ ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో అత్యాధునిక వైద్య పరికరాలు ఏర్పాటు చేయడం హర్షనీయమన్నారు. కార్యక్రమంలో సామాజిక కార్యకర్త, చారిటీ నిర్వాహకులు ఎస్పీ రెడ్డి, ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీనివాస్, ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రి సూపరింటెండెంట్ అరుణకుమారి, డీఎంహెచ్‌ఓ డాక్టర్ పుట్ల శ్రీనివాస్, డీసీహెచ్‌ఎస్ మాతృనాయక్, ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ సత్యనారాయణ, జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు హఫీజ్ ఖాన్, ఆర్డీఓ వై.అశోక్‌రెడ్డి, మెడికల్ కళాశాల వైస్ ప్రిన్సిపీల్ రాధాకృష్ణ, డిప్యూటీ డీఎంహెచ్‌ఓలు, డాక్టర్లు పాల్గొన్నారు.
ఫ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందిస్తాం