
కాలేజీల్లో విద్యార్థుల అర్ధాకలి
కార్యరూపం దాల్చేనా?
హాలియా : ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో విద్యార్ధులకు ఆకలి బాధ తప్పడం లేదు. ప్రభుత్వ పాఠశాలల తరహాలోనే జూనియర్ కళాశాలల్లోనూ మధ్యాహ్న భోజన పథకం అమలు చేస్తామన్న ప్రభుత్వ ప్రకటన ఉత్తమాటగానే మారింది. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదువుకుంటున్న వారిలో ఎక్కువ శాతం పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థులే ఉన్నారు. వీరిలో 80 శాతం మంది గ్రామాల నుంచి కళాశాలకు వస్తున్నారు. చాలా మంది విద్యార్ధులకు ఇంటి నుంచి భోజనం తెచ్చుకునే పరిస్ధితి లేకుండా పోవడంతో రోజంతా పస్తులతో ఉంటున్నారు. ఈ సమస్యను గమనించిన ప్రభుత్వం జూనియర్ కళాశాలల విద్యార్ధులకు కూడా మధ్యాహ్న భోజనం అందించాలని ప్రతిపాదన ముందుకు తెచ్చింది. దీంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఎంతో సంతోషించారు. అయితే ప్రతి ఏడాది ఇప్పుడు.. అప్పుడు అంటూ కాలం గడుస్తోంది. ఈ విద్యా సంవత్సరంలోనూ ఈ ఊసే లేకపోవడంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు.
సిద్ధమైన ప్రతిపాదనలు
ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు గ్రామీణ ప్రాంతాల నుంచి ఎంతో మంది విద్యార్థులు వస్తుంటారు. వారు ఉదయాన్నే గ్రామాల నుంచి బయల్దేరి కళాశాలకు చేరుకుంటారు. కొందరు విద్యార్థులు ఉదయం భోజనం చేసి రావడం.. మధ్యాహ్న భోజనం వెంట తెచ్చుకోవడం కష్టంగా ఉంటుంది. అలాంటి విద్యార్థులు కళాశాలల్లో ఆకలి బాధతో తరగతులు వినాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదివే విద్యార్థులకు మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ప్రతిపాదనలు స్వీకరించింది. 2024–2025 విద్యా సంవత్సరం చివరలో ఈ ప్రతిపాదనలు సిద్ధం చేయడంతో 2025–26 విద్యా సంవత్సరం ప్రారంభం నుంచి మధ్యాహ్న భోజన పథకం అమలవుతుందని అంతా భావించారు. కానీ ఇప్పటికి వరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటన రాకపోవడంతో ఈ సారి కూడా పథకం అమలయ్యే సూచనలు కనిపించడం లేదు.
జూనియర్ కళాశాలల్లో అమలుకు నోచని మధ్యాహ్న భోజన పథకం
ఫ ఉత్తమాటగా మారిన ప్రభుత్వ ప్రకటన
ఫ ఈ ఏడాదైనా అమలు చేయాలని విద్యార్థుల వేడుకోలు
ప్రభుత్వ జూనియర్ కళాశాలలు 15
విద్యార్థుల సంఖ్య 12,336
ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం ప్రారంభమైన తర్వాతే విద్యార్థుల హాజరు శాతం పెరిగింది. ఇదే ఫార్ములాను కళాశాలల్లో ప్రయోగిస్తే బాగుటుందని అందరూ భావిస్తున్నారు. 2018లో అప్పటి ప్రభుత్వం ప్రభుత్వ జూనియర్ కళాశాలల విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పెట్టాలని భావించినప్పటికీ కార్యరూపం దాల్చలేదు. ఆ తరువాత 2021లో మరోమారు ఈ ప్రయత్నం చేసినప్పటికీ ఆచరణకు నోచుకోలేదు. నల్లగొండ జిల్లాలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలు పాతవి 12 ఉండగా, నార్కట్‌పల్లిలో రెండేళ్ల క్రితం నూతనంగా ప్రభుత్వ జూనియర్ కళాశాల ఏర్పాటు చేయగా కనగల్, తిప్పర్తి మండల కేంద్రాల్లో ఈ విద్యా సంవత్సరం ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ప్రారంభమయ్యాయి. జిల్లాలో మొత్తం 15 కళాశాలల్లో 12,336 మంది విద్యార్థులు ప్రభుత్వ జూనియర్ కళాశాల్లో విద్యనభ్యసిస్తున్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి కళాశాలల్లో భోజన సౌకర్యం కల్పించాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కోరుతున్నారు.