
సాక్షి నల్లగొండ: మైనర్ బాలికపై అత్యాచారం కేసులో సంచలన తీర్పు వెలువడింది. నిందితుడు మహ్మద్ కయ్యుమ్‌కు 50 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ మంగళవారం నల్లగొండ పోక్సో POCSO కోర్టు ఇన్‌ఛార్జి రోజారమణి తీర్పు వెల్లడించారు.
పోక్సో చట్టం కింద 20 సంవత్సరాలు, ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద మరో 20 సంవత్సరాలు, కిడ్నాప్ కేసుకుగానూ మరో పదేళ్లు.. మొత్తం 50 సంవత్సరాల కఠిన జైలు శిక్ష విధిస్తున్నట్లు జడ్జి రోజారమణి ప్రకటించారు.బాలికలపై జరిగే అఘాయిత్యాలను అరికట్టేందుకు కఠిన శిక్షలు అవసరం. ఈ తీర్పు సమాజానికి హెచ్చరికగా నిలవాలి అని ఆమె అభిప్రాయపడ్డారు.

కేసు నేపథ్యం..
బాధిత బాలికపై లైంగిక దాడి జరిగినట్లు తిప్పర్తి పోలీస్ స్టేషన్‌లో మహ్మద్ కయ్యుమ్ అనే వ్యక్తి మీద 2021లో కేసు నమోదైంది. 2022 నుంచి నల్లగొండ జిల్లా కోర్టులో విచారణ కొనసాగింది.వాదనలు, సాక్ష్యాలు, ఫోరెన్సిక్ ఆధారాల ఆధారంగా న్యాయమూర్తి నిందితుడిని దోషిగా తేల్చారు. ఈ కేసు తెలంగాణలో POCSO చట్టం కింద అత్యధిక శిక్ష విధించిన కేసులలో ఒకటిగా చరిత్రలో నిలిచే అవకాశం కనిపిస్తోంది.