
బిల్లులు విడుదల చేయాలని కాంట్రాక్టర్ ధర్నా
భువనగిరిటౌన్ : భువనగిరి మండలంలోని హన్మాపురం, తాజ్‌పూర్ గ్రామాలలో చేపట్టిన అభివృద్ధి పనులకు సంబంధించిన రూ.42లక్షల పెండింగ్ బిల్లులు చెల్లిచాలని కాంట్రాక్టర్ నాగపురి కృష్ణ తన భార్య, కుమారులతో కలిసి సోమవారం భువనగిరి కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టాడు. రెండు సంవత్సరాల నుంచి తాను చేసిన పనులకు సంబంధించి రావలసిన రూ.42 లక్షలు విడుదల కాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నానని చెప్పాడు. ఎన్నిసార్లు అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేసినా పెండింగ్ బిల్లులు విడుదల కాకపోవడంతో మానసిక క్షోభకు గురవుతున్నట్లు పేర్కొన్నాడు. ఆర్థిక ఇబ్బందులు అప్పుల బాధతో కుటుంబం గడవని పరిస్థితి నెలకొందని పెండింగ్ బిల్లులు విడుదల కాకపోతే తనకు మరణమే శరణ్యమని కంటనీరు పెట్టుకున్నాడు. 2023లో అప్పటి ప్రభుత్వ హయాంలో రూ.20 లక్షలతో గ్రామ పంచాయతీ భవనం, రూ.8 లక్షలతో కమ్యూనిటీ హాల్, రూ.5లక్షలతో బీసీ కమ్యూనిటీ హాల్, రూ.8లక్షలతో అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ పనులను చేపట్టినట్టు కృష్ణ చెప్పాడు. తన దీక్ష మంగళవారం కూడా కొనసాగుతుందని తెలిపాడు.
ఎయిమ్స్‌లో స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వాలి
● బీఆర్‌ఎస్ నాయకుల నిరసన దీక్ష
బీబీనగర్: బీబీనగర్ ఎయిమ్స్ వైద్య కళాశాలలో పట్టణవాసులకు ఉద్యోగవకాశాలు ఇవ్వాలని కోరుతూ స్థానిక బీఆర్‌ఎస్ నాయకులు సోమవారం ఎయిమ్స్ ఎదుట నిరసన దీక్ష చేపట్టారు. అనంతరం పోలీసులు అక్కడకు చేరుకొని దీక్షను విరమించాలని నచ్చజెప్పడంతో నాయకులు ఎయిమ్స్ అధికారులను కలిసి ఉద్యోగవకాశాలపై వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు మల్లగారి శ్రీనివాస్, పిట్టల అశోక్, గోలి సంతోష్‌రెడ్డి, లక్ష్మీనారాయణ, ఖాజా మోయినుద్దీన్, అమృతం, శ్రీనివాస్, పరంకుశం తదితరులు పాల్గొన్నారు.

బిల్లులు విడుదల చేయాలని కాంట్రాక్టర్ ధర్నా